రామప్ప గుడి తెలుగువారికి గర్వకారణమన్న ఉపరాష్ట్రపతి... మోదీ కృషి ఎంతో ఉందన్న బండి సంజయ్

  • రామప్ప గుడికి యునెస్కో గుర్తింపు
  • ప్రపంచ వారసత్వ కట్టడంగా గుర్తింపు
  • హర్షం వ్యక్తం చేసిన వెంకయ్యనాయుడు
  • కాకతీయ శిల్పకళా నైపుణ్యానికి నిదర్శనమని వెల్లడి
ములుగు జిల్లా పాలంపేటలో ఉన్న చారిత్రాత్మక రామప్ప గుడికి యునెస్కో ప్రపంచ వారసత్వ కట్టడం గుర్తింపు ఇవ్వడం పట్ల భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు స్పందించారు. తెలంగాణలోని 13వ శతాబ్దం నాటి రామప్ప ఆలయానికి ప్రపంచ వారసత్వ స్థలంగా యునెస్కో గుర్తింపు దక్కడం హర్షణీయమని వ్యాఖ్యానించారు. ఈ ఆలయం కాకతీయ శిల్ప కళా నైపుణ్యానికి నిలువెత్తు నిదర్శనమని అభివర్ణించారు. 2020 సంవత్సరానికి మన దేశంలో ఈ ఒక్క కట్టడానికే గుర్తింపు దక్కిందని, పైగా తెలుగు రాష్ట్రాల్లో వారసత్వ కట్టడంగా గుర్తింపు పొందిన తొలి కట్టడం రామప్ప గుడి అని వెంకయ్య నాయుడు వివరించారు. ఇది తెలుగు వారందరూ గర్వించదగిన విషయం అని తెలిపారు.

అటు, తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ కూడా ఈ అంశంపై స్పందించారు. రామప్ప గుడికి ఇంతటి గొప్ప గుర్తింపు దక్కడం కోసం సభ్యదేశాలతో ఏకాభిప్రాయం సాధించడానికి ప్రధాని మోదీ ఎంతో కృషి చేశారని వెల్లడించారు. ఎంతో వేగంగా నిర్ణయాలు తీసుకుని, సత్వర చర్యలు చేపట్టారని తెలిపారు. అన్ని దేశాల ఏకాభిప్రాయంతోనే ఇది సాధ్యమైందని స్పష్టం చేశారు. తెలంగాణ చారిత్రక గొప్పదనాన్ని విశ్వవేదికపై నిలబెట్టిన ఘనత మోదీ సర్కారుదేనని బండి సంజయ్ ఉద్ఘాటించారు.

రామప్ప గుడికి ఇంతటి ఘనతర గుర్తింపు లభించడంలో తోడ్పాటు అందించిన ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర పర్యాటక మంత్రి కిషన్ రెడ్డి, కేంద్ర సహాయమంత్రి మీనాక్షి లేఖిలకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని వివరించారు.


More Telugu News