గోపాల్ అన్న దంపతులు చెప్పిన మాటలతో మనసంతా కలచివేసింది: సీఎం జగన్

  • నాడు పాదయాత్ర చేసిన వైఎస్ జగన్
  • ఉదయగిరి నియోజకవర్గం గుండా పాదయాత్ర
  • గోపాల్ అనే వ్యక్తితో మాట్లాడిన జగన్
  • కొడుకు చదువు కోసం అప్పు చేశానన్న గోపాల్
  • తండ్రి పరిస్థితి చూసి కొడుకు ఆత్మహత్య
ఏపీలో సీఎం జగన్ ఇవాళ రెండో విడత విద్యాదీవెన నిధులు విడుదల చేశారు. ఒక్క బటన్ క్లిక్ తో 9.88 లక్షల మంది తల్లుల ఖాతాల్లో రూ.694 కోట్లు జమ చేశారు. ఈ సందర్భంగా ఆయన, ఫీజు రీయింబర్స్ మెంట్ పై తనలో ఆలోచన కలిగించిన ఓ పేద దంపతుల మాటలను స్మరించుకున్నారు.

"నేను పాదయాత్ర చేసేటప్పుడు నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం నుంచి వెళ్లాను. ఆ నియోజకవర్గానికి చెందిన గోపాల్ అన్న దంపతులు చెప్పిన మాటలు ఇప్పటికీ మర్చిపోలేను. పై చదువులు చదివించాలంటే ఫీజులు లక్షల్లో ఉన్నాయని, ప్రభుత్వం నుంచి వచ్చే సాయం ఏమాత్రం సరిపోవడంలేదని ఆ దంపతులు చెప్పారు. ఏడాదికి రూ.70 వేలు అప్పులు చేస్తే కానీ కొడుకు చదువుకోలేని పరిస్థితి ఏర్పడిందని వారు వివరించారు. కానీ, తల్లిదండ్రుల పరిస్థితి చూసి ఆ కొడుకు ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు.

నేను పాదయాత్ర చేస్తున్న సమయంలో గోపాల్ అన్న తన కొడుకు ఫొటో ఇంటివద్ద పెట్టుకుని ఉన్నాడు. తన బాధ చూడలేక కొడుకు ఆత్మహత్య చేసుకుని చనిపోయాడంటూ గోపాల్ అన్న చెప్పిన మాటలతో మనసంతా కలచివేసింది. అధికారంలోకి రాగానే ఇలాంటి పరిస్థితులు మార్చాలని ఆనాడే అనుకున్నాను. ఈ క్రమంలో వచ్చినవే జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన.

ఐటీఐ, డిగ్రీ, పాలిటెక్నిక్, మెడిసిన్, ఇంజినీరింగ్ చదువుతున్న అందరు విద్యార్థులకు పూర్తి ఫీజు రీయింబర్స్ మెంట్ (విద్యాదీవెన) చేస్తున్నాం. దేశంలో మరెక్కడా లేని విధంగా బకాయిలు లేని రీతిలో సకాలంలో తల్లుల ఖాతాల్లోకి డబ్బు జమ చేస్తున్నాం" అని వివరించారు.


More Telugu News