వంగపండు ప్రథమ వర్ధంతి సందర్భంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన ఆర్.నారాయణమూర్తి, గద్దర్

  • విశాఖలో వంగపండు ప్రథమ వర్ధంతి కార్యక్రమం
  • హాజరైన ఆర్.నారాయణమూర్తి, గద్దర్
  • బాడ సూరన్నకు అవార్డు ప్రదానం చేసిన అవంతి
  • వంగపండును కీర్తించిన నారాయణమూర్తి, గద్దర్
ప్రజాకవి, గాయకుడు వంగపండు ప్రసాదరావు ప్రథమ వర్ధంతి సందర్భంగా జరిగిన ఓ కార్యక్రమంలో ప్రముఖ సినీ నటుడు ఆర్.నారాయణమూర్తి, గద్దర్ పాల్గొన్నారు. విశాఖపట్నంలో జరిగిన ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం జిల్లాకు చెందిన బాడ సూరన్నకి వంగపండు స్మారక అవార్డును మంత్రి అవంతి శ్రీనివాస్ ప్రదానం చేశారు.

ఈ కార్యక్రమంలో ఆర్. నారాయణమూర్తి మాట్లాడుతూ వంగపండును వేనోళ్ల కీర్తించారు. ప్రజల హృదయాల్లో స్థానం సంపాదించుకున్న వ్యక్తి అని, అప్పట్లో గద్దర్ ను ఢీ అంటే ఢీ అన్న ఏకైక మహాకవి వంగపండు అని వివరించారు. ఆయనే గనుక ఇవాళ బతికి ఉంటే విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం తన గళంతో తీవ్రస్థాయిలో ఉద్యమించేవాడని అన్నారు. స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరణ కాకుండా కాపాడుకోవడమే వంగపండుకు అందించే అసలైన నివాళి అని పేర్కొన్నారు.

అటు, గద్దర్ మాట్లాడుతూ, వంగపండును తన బావగా పేర్కొన్నారు. తాను పాడిన పాటలన్నీ తన బావ వంగపండు రాసినవేనని వెల్లడించారు. వంగపండు కార్మికుడిగానే కాకుండా, ఉద్యమకారుడిగా, ప్రజాకవిగా ఎంతో జీవితాన్ని చూశాడని వివరించారు. ప్రజల కోసం 78 ఏళ్లు బతికిన వంగపండును పార్టీ పట్టించుకోలేదని గద్దర్ ఆవేదన వ్యక్తం చేశారు. వంగపండు పార్టీలోనూ ధైర్యంగా తన గళం వినిపించేవాడని, అ, ఆ లు ఉన్నంతవరకు ఆయన నిలిచే ఉంటారని తెలిపారు. వంగపండు రాసిన ప్రతిపాటలో తాత్వికత ఉండేదని అభిప్రాయపడ్డారు.


More Telugu News