తన బయోపిక్​ పై ఆసక్తికర కామెంట్లు చేసిన బల్లెం వీరుడు నీరజ్​ చోప్రా

  • ఇంకా సాధించాల్సినవి చాలా ఉన్నాయి
  • గొప్ప గొప్ప విజయాలు సాధించాలి
  • అప్పుడు మరిన్ని కథలు రాసుకోవచ్చు
  • ఇంటికెళ్లి అమ్మచేతి చూర్మా తింటా
  • కొన్నాళ్లు కరవుతీరా నిద్రపోతా
ఒలింపిక్స్ అథ్లెటిక్స్ విభాగంలో స్వర్ణ పతకం సాధించి చరిత్ర సృష్టించిన బల్లెం వీరుడు నీరజ్ చోప్రా తన జీవితచరిత్రను సినిమాగా తీయడంపై ఆసక్తికర కామెంట్లు చేశాడు. ఓ ఆంగ్ల వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన భవిష్యత్ ప్రణాళికలు, కార్యాచరణ గురించి చెప్పుకొచ్చాడు.

‘మీ బయోపిక్ లో మీరే నటించాలని అందరూ అడుగుతున్నారు కదా?’ అని విలేకరి ప్రశ్నించగా.. 'అప్పుడే నా బయోపిక్ ఏమిటి?' అంటూ నవ్వుతూ తిరిగి ప్రశ్నించాడు. ప్రస్తుతం తన దృష్టంతా ఆటమీదేనన్నాడు. బయోపిక్ ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడైనా తీసుకోవచ్చన్నాడు. తాను ఆటల నుంచి పూర్తిగా రిటైరైనప్పుడు దాని గురించి ఆలోచిద్దామంటూ బదులిచ్చాడు.

ఓ అథ్లెట్ గా సాధించాల్సింది ఇంకా చాలా ఉందని, ఇంకా గొప్ప గొప్ప విజయాలను సొంతం చేసుకోవడానికి కష్టపడాల్సి ఉందని, అప్పుడు మరిన్ని గొప్ప కథలు తనమీద వస్తాయని చెప్పుకొచ్చాడు. అవన్నీ సాధించాక.. ఆటల నుంచి రిటైరయ్యాక.. బయోపిక్ తీయొచ్చన్నాడు.

ప్రస్తుతం ఇంటికెళ్లి అమ్మ వండిన చూర్మాను తినేందుకు ఎదురుచూస్తున్నానని నీరజ్ చెప్పాడు. కొన్నాళ్లపాటు విరామం తీసుకుంటానని, కరవుతీరా నిద్రపోతానని తెలిపాడు. ఆ తర్వాత కామన్ వెల్త్, ఏషియన్ గేమ్స్, వరల్డ్ చాంపియన్ షిప్ లకు మళ్లీ శిక్షణ మొదలు పెడతానని వివరించాడు. మెడలో బంగార పతకాన్ని ధరించినప్పుడు.. దేశ జాతీయ గీతాన్ని వేదిక మీద విన్నప్పుడు కలిగిన ఉద్వేగం మాటల్లో వర్ణించలేనన్నాడు.

జావెలిన్ త్రో అనేది టెక్నిక్ తో కూడిన ఆట అని, మెదడును నియంత్రణలో ఉంచుకుంటూ ఆడాల్సి ఉంటుందని చెప్పాడు. ఏకాగ్రత కొంచెం దెబ్బతిన్నా శ్రమంతా వృథా అయిపోతుందని వివరించాడు. వ్యక్తిగత రికార్డులకన్నా ఒలింపిక్స్ లో సాధించిన స్వర్ణానికే ‘మెరుగు’ ఎక్కువన్నాడు. మొదటి ప్రయత్నంలోనే వీలైనంత ఎక్కువ దూరం విసరాలంటూ కోచ్ క్లాస్ బార్టోనీజ్ చెప్పారని తెలిపాడు. చాన్స్ తీసుకోవద్దన్నాడని వివరించాడు. తన చిన్ననాటి కోచ్ జైవీర్, బాబాయి భీమ్ చోప్రా కూడా అదే విషయం చెప్పారన్నాడు. దీంతో మొదటి రెండు ప్రయత్నాల్లోనే ఎక్కువ దూరం విసిరే ప్రయత్నం చేశానని అతడు చెప్పుకొచ్చాడు.

1960 రోమ్ ఒలింపిక్స్ లో పరుగుల వీరుడు మిల్కా సింగ్ త్రుటిలో స్వర్ణం కోల్పోయారని, ఆ క్షణం నుంచి అథ్లెటిక్స్ లో పతకాల పోడియంపై భారతీయుడిని చూడాలన్న కలను ఆయన కన్నారని నీరజ్ గుర్తుచేసుకున్నాడు. అందుకే స్వర్ణ పతకాన్ని ఆయనకే అంకితమిచ్చానని చెప్పుకొచ్చాడు. అయితే, ఈ క్షణంలో ఆయన లేకపోవడం విచారకరమన్నారు.


More Telugu News