గృహ నిర్మాణం అంశంలో టీడీపీ, వైసీపీలపై విమర్శలు గుప్పించిన విష్ణువర్ధన్ రెడ్డి

  • కేంద్రం రూ.30,936 కోట్లు మంజూరు చేసిందన్న విష్ణు
  • రాష్ట్రం ఖర్చుచేసింది రూ.6,868 కోట్లేనని వెల్లడి
  • ఎన్నాళ్లు పేదలకు అన్యాయం చేస్తారని ఆగ్రహం
  • సర్కారుకు పేదలు బుద్ధి చెబుతారని వ్యాఖ్యలు
ఏపీ బీజేపీ ప్రధాన కార్యదర్శి ఎస్.విష్ణువర్ధన్ రెడ్డి పేదలకు ఇళ్ల నిర్మాణం అంశంపై తీవ్రస్థాయిలో స్పందించారు. 2014 నుంచి ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి రూ.30,936 కోట్లు పట్టణ గృహనిర్మాణం కోసం ఇచ్చిందని వెల్లడించారు. దేశంలోనే అత్యధికంగా 20,38,000 ఇళ్లను కేంద్రం ఏపీకి మంజూరు చేసిందని తెలిపారు. టీడీపీ పాలించిన ఐదేళ్లలోనూ, వైసీపీ రెండేళ్ల పాలనలోనూ రాష్ట్రం కేంద్రం నుంచి తీసుకున్నది రూ.10,110 కోట్లు మాత్రమేనని, అందులోనూ రూ.6,868 కోట్లు మాత్రమే ఉపయోగించారని వివరించారు.

"ఎన్నాళ్లు పేదలకు అన్యాయం చేస్తారు? వేల కోట్ల కేంద్ర నిధులతో నిర్మించిన గృహాలను పేదలకు ఎందుకు ఇవ్వలేదు? ఈ ప్రశ్నలకు నాటి టీడీపీ, నేటి వైసీపీ ప్రభుత్వాలు సమాధానం ఇవ్వాలి" అని విష్ణువర్ధన్ రెడ్డి డిమాండ్ చేశారు. ఇచ్చిన నిధులను కూడా సక్రమంగా వినియోగించుకోలేని పరిస్థితుల్లో నేటి వైసీపీ ప్రభుత్వం ఉందని, ప్రభుత్వ చేతగానితనానికి ఇదే నిదర్శనమని విమర్శించారు.

కేంద్రం ఒక్కో ఇంటికి తన వాటాగా రూ.1.50 లక్షలు, నరేగా నిధుల నుంచి రూ.30 వేలు కలిపి మొత్తంగా రూ.1.80 లక్షలు ఇచ్చిందని వెల్లడించారు. కానీ, ఒక్క రూపాయికే ఇల్లు ఇస్తామన్న జగన్, పట్టణ ప్రాంతాల్లో 4.63 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తయినప్పటికీ నేటికీ ఒక్క ఇల్లు కూడా మంజూరు చేయలేదని విష్ణు ఆరోపించారు. దీన్నిబట్టి వైసీపీ పేదల వ్యతిరేక ప్రభుత్వం అని అర్థమవుతోందని వ్యాఖ్యానించారు. వైసీపీ సర్కారుకు పేదలు బుద్ధి చెప్పే రోజు త్వరలోనే వస్తుందని స్పష్టం చేశారు.


More Telugu News