బీజేపీకి వ్యతిరేకంగా ఒక్కటవుతున్న విపక్షాలు.. 20న సోనియాతో నేతల భేటీ

  • వర్చువల్‌గా సమావేశం
  • హాజరుకానున్న పలువురు ముఖ్యమంత్రులు
  • వివిధ అంశాలపై చర్చ
కేంద్రంలోని అధికార బీజేపీకి వ్యతిరేకంగా విపక్షాలను ఒక్కటి చేయాలని నిర్ణయించుకున్న కాంగ్రెస్ ఆ ప్రయత్నాల్లో బిజీ అయింది. ఈ క్రమంలో, ఈ నెల 20న కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ నిర్వహించనున్న వర్చువల్ సమావేశానికి హాజరు కావాల్సిందిగా కోరుతూ టీఎంసీ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, శివసేన అధినేత, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే, డీఎంకే చీఫ్, తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్, ఝార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్, ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్ తదితర నేతలను కాంగ్రెస్ ఆహ్వానించింది.

సానుకూలంగా స్పందించిన నేతలు హాజరవుతామంటూ తమ సమ్మతిని తెలియజేశారు. వీరితోపాటు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా సమావేశంలో పాల్గొంటారు. పార్లమెంటును కుదిపేసిన పెగాసస్ స్పైవేర్ వివాదం, నిర్ణీత సమయానికి రెండు రోజుల ముందే వర్షాకాల సమావేశాలు ముగియడం, లోక్‌సభ, రాజ్యసభ నిర్వహణ తీరుపై అధికార, విపక్షాల మధ్య పరస్పర నిందారోపణల నేపథ్యంలో కాంగ్రెస్ అధినేత్రి విపక్ష నేతలతో సమావేశం నిర్వహించనుండడం ప్రాధాన్యం సంతరించుకుంది.


More Telugu News