కృష్ణా నదికి ఆకస్మిక వరద: చిక్కుకున్న 132 ఇసుక లారీలు.. తప్పిన పెను ప్రమాదం

  • వరద ప్రవాహన్ని గుర్తించి జేసీబీలతో ఆవలి ఒడ్డుకు రీచ్ సిబ్బంది
  • లారీలు వెనక్కి తిప్పేసరికే పెరిగిన వరద
  • రాతంత్రా బిక్కుబిక్కుమంటూ గడిపిన 150 మంది
  • ఆరు గంటలు శ్రమించి రక్షించిన పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది
కృష్ణా నదిలో అర్ధరాత్రి ఇసుక తవ్వకాలు కొంప ముంచాయి. ఆకస్మకంగా వచ్చి పడిన వరదకు 132 లారీలు, 5 ట్రాక్టర్లు చిక్కుకుపోయాయి. అందులోని 150 మంది వరద నీటిలో చిక్కుకుని రాత్రంతా బిక్కుబిక్కుమంటూ గడిపారు. విషయం తెలిసిన పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఆరు గంటలపాటు శ్రమించి రక్షించడంతో అందరూ ప్రాణాలతో బయటపడ్డారు. కృష్ణా జిల్లా కంచికచర్ల సమీపంలోని చెవిటికల్లు ఇసుక రీచ్‌లో జరిగిందీ ఘటన.

రెండు రోజులుగా ఇక్కడ జోరుగా ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయి. శుక్రవారం రాత్రి వందకుపైగా లారీలు నదీగర్భంలోకి వెళ్లాయి. తెల్లవారుజామున మూడున్నర గంటల సమయంలో వరద పెరుగుతుండడాన్ని గమనించిన రీచ్ సిబ్బంది జేసీబీలతో కలిసి అవతలి ఒడ్డుకు చేరుకున్నారు. అనంతరం లారీ డ్రైవర్లకు సమాచారం ఇచ్చారు. వారు లారీలను వెనక్కి తిప్పేసరికే వేసిన బాట కొట్టుకుపోయింది. ఫలితంగా వాహనాలన్నీ అక్కడే చిక్కుకుపోయాయి. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సహకారంతో నాటు పడవలు, గజ ఈతగాళ్లతో వెళ్లి వాహన డ్రైవర్లు, ఇతర సిబ్బంది రక్షించి సురక్షితంగా ఒడ్డుకు తరలించారు.


More Telugu News