నారా లోకేశ్ అరెస్ట్.. తొలిసారి అరెస్ట్ అయిన టీడీపీ నేత

  • రమ్య కుటుంబాన్ని పరామర్శించిన లోకేశ్ 
  • పర్యటన సందర్భంగా తీవ్ర ఉద్రిక్తత
  • లోకేశ్ తో పాటు ధూళిపాళ్ల, నక్కా, ఆలపాటి అరెస్ట్
తెలుగుదేశం పార్టీ అగ్ర నేత నారా లోకేశ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. గుంటూరు జిల్లా ప్రత్తిపాడు పోలీస్ స్టేషన్ కు ఆయనను తరలించారు. వివరాల్లోకి వెళ్తే, గుంటూరులో ఉన్నాది చేతిలో దారుణ హత్యకు గురైన బీటెక్ విద్యార్థిని రమ్య కుటుంబాన్ని టీడీపీ నేతలు నారా లోకేశ్, ధూళిపాళ్ల నరేంద్ర, నక్కా ఆనందబాబు, ఆలపాటి రాజా తదితర నేతలు పరామర్శించారు. ఈ సందర్భంగా టీడీపీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో అక్కడకు చేరుకున్నారు.

ఈ క్రమంలో రాజకీయ లబ్ధి కోసమే నారా లోకేశ్ వచ్చారంటూ వైసీపీ శ్రేణలు ఆరోపించాయి. టీడీపీ, వైసీపీ శ్రేణుల మధ్య వాగ్వాదం నెలకొంది. అక్కడే ఉన్న పోలీసులు టీడీపీ నేతలను అక్కడి నుంచి పంపించే ప్రయత్నం చేశారు. దీంతో టీడీపీ శ్రేణులు, పోలీసుల మధ్య తోపులాట జరిగింది. పోలీసులు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా టీడీపీ నేతలు నినాదాలు చేశారు. ఈ సందర్భంగా నారా లోకేశ్, నరేంద్ర, ఆనంద్ బాబు, ఆలపాటి రాజా లతో పాటు పలువురు నేతలను అరెస్ట్ చేశారు.

లోకేశ్ ని ప్రత్తిపాడు పోలీస్ స్టేషన్ కు తరలించారు. పోలీస్ వాహనంలోకి ఎక్కే సమయంలో నారా లోకేశ్ పిడికిలి బిగించి, చేయెత్తి టీడీపీ శ్రేణులను ఉత్తేజపరిచారు. మరోవైపు మిగిలిన నేతలను నల్లపాడు పీఎస్ కు తరలించారు. లోకేశ్ అరెస్ట్ పై టీడీపీ శ్రేణులు మండిపడుతున్నాయి. తన రాజకీయ జీవితంలో నారా లోకేశ్ అరెస్ట్ కావడం ఇదే తొలిసారి.


More Telugu News