ఆఫ్ఘనిస్థాన్ నుంచి ముందుగానే భారతీయులను తరలించాల్సింది: సీతారాం ఏచూరి

  • కేంద్ర ప్రభుత్వంపై సీపీఎం పార్టీ జనరల్ సెక్రటరీ విమర్శ
  • స్టేట్ కమిటీ మీటింగ్ కోసం కోయంబత్తూర్ చేరిన కమ్యూనిస్టు నేత
  • ఆఫ్ఘన్‌లో తీసుకున్న ముందు జాగ్రత్త చర్యలు ఏంటి?
  • కేంద్రాన్ని ప్రశ్నించిన ఏచూరి
పరిస్థితి ఇంత ముదరక ముందే ఆఫ్ఘనిస్థాన్ నుంచి భారతీయులను స్వదేశానికి తరలించడంలో భారత ప్రభుత్వం విఫలమైందని సీపీఎం జనరల్ సెక్రటరీ సీతారాం ఏచూరి విమర్శించారు. ఆ దేశాన్ని తాలిబన్లు హస్తగతం చేసుకున్న తర్వాత, ఎయిర్‌స్పేస్ మూసేసిన సంగతి తెలిసిందే. దీంతో ఆఫ్ఘనిస్థాన్‌లో చిక్కుకుపోయిన భారతీయులు భయంభయంగా గడుపుతున్నారు.

ఈ నేపథ్యంలోనే సీతారాం ఏచూరి కేంద్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. స్టేట్ కమిటీ సమావేశం కోసం ఆయన కోయంబత్తూర్ చేరుకున్నారు. ఈ సమావేశానికి ముందు మీడియాతో మాట్లాడిన ఆయన.. ఆఫ్ఘనిస్థాన్ నుంచి భారతీయులను తరలించడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు.

ఆఫ్ఘనిస్థాన్‌లో తాలిబన్లు వేగంగా ముందుకు సాగడం చూసిన తర్వాత చాలా దేశాలు తమ పౌరులను స్వదేశాలకు తరలించాయని ఏచూరి చెప్పారు. ‘‘దాదాపు పది, పదిహేను రోజులుగా ఆఫ్ఘనిస్థాన్‌లో కనిపిస్తున్న పరిణామాలు చూస్తే.. ఆ తర్వాత ఏం జరగబోతుందో అర్థమైపోతుంది. ఈ పరిస్థితిని ఎదుర్కోవడానికి తీసుకున్న ముందు జాగ్రత్త చర్యలేంటి?’’ అని కేంద్ర ప్రభుత్వాన్ని ఏచూరి ప్రశ్నించారు.

అమెరికాకు భారత్ తాబేదారు దేశంగా కనిపిస్తోందని ఏచూరి విమర్శించారు. ‘‘ఆఫ్ఘనిస్థాన్ నుంచి అమెరికా సైన్యం అర్థాంతరంగా వెళ్లిపోవడం సమస్య కాదు. అసలు అమెరికా అక్కడ అడుగే పెట్టాల్సింది కాదు’’ అని ఏచూరి పేర్కొన్నారు.


More Telugu News