పేరు అడిగి.. గాజులు అమ్ముకునే యువకుడిని చితకబాదిన వైనం!

  • మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో ఘటన
  • బాధితుడి నుంచి డబ్బు కూడా లాక్కున్న నిందితులు 
  • తప్పుడు పేరు చెప్పాడన్న హోంమంత్రి
గాజులు అమ్ముకునే ఓ 25 ఏళ్ల ముస్లిం వ్యక్తిని కొందరు వ్యక్తులు పబ్లిక్ గా చితకబాదిన ఘటన మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో జరిగింది. అంతేకాదు, అతని వద్ద ఉన్న రూ. 10 వేలను కూడా లాక్కున్నారు. ఈ ఘటన నిన్న జరిగింది. దీంతో ఈ ఘటనకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ వందలాది మంది పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళన చేపట్టడంతో... నిన్న రాత్రి కేసు నమోదు చేశారు. ముగ్గురు అనుమానితులను అరెస్ట్ చేశారు.

గాజుల వ్యాపారిని చితకబాదుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఎంతో రద్దీగా ఉండే బంగాంగా వీధిలో బాధితుడు తస్లీమ్ పై ఒక గుంపు దాడి చేసింది. మతం పేరుతో తిడుతూ దాడికి తెగబడ్డారు. చూట్టూ ఉన్నవారు ప్రేక్షకపాత్రను పోషించారే తప్ప... దాడిని ఆపే ప్రయత్నం మాత్రం చేయలేదు.

మరోవైపు జరిగిన ఘటనపై పోలీస్ స్టేషన్ లో తస్లీమ్ ఫిర్యాదు చేశాడు. నిందితులు తొలుత తన పేరును అడిగారని.. తాను పేరు చెప్పిన వెంటనే కొట్టడం ప్రారంభించారని ఫిర్యాదులో పేర్కొన్నాడు. తన వద్ద ఉన్న రూ. 10 వేలను కూడా లాక్కున్నారని... దెబ్బలు తాళలేక తాను ఏడుస్తున్నా ఆపలేదని, తన వద్ద ఉన్న గాజులను పగలగొట్టారని చెప్పాడు. ఈ నేపథ్యంలో నిందితులపై దాడి, దొంగతనం, మత సామరస్యానికి విఘాతం తదితర సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

దీనిపై మధ్యప్రదేశ్ హోంమంత్రి నరోత్తమ్ మిశ్రా మాట్లాడుతూ, ఈ ఘటనకు మతం రంగు పులమొద్దని కోరారు. బాధితుడు తప్పుడు పేరు చెప్పుకుంటూ వ్యాపారం చేసుకుంటున్నాడని చెప్పారు. పేరు, మతం, కులాన్ని దాచిపెడితే ఇలాంటి పర్యవసానాలే ఎదురవుతాయని అన్నారు. రుతుపవనాలు వచ్చే ఈ కాలంలో మన బిడ్డలు గోరింటాకు పెట్టుకుని, గాజులు ధరిస్తారని చెప్పారు. గాజులు అమ్ముకుంటున్న ఆ వ్యక్తి తప్పుడు పేరు చెప్పుకుంటున్నాడని... ఐడీ కార్డు చూస్తే అసలు నిజం బయటకు వచ్చిందని తెలిపారు.


More Telugu News