భవానీపూర్ అసెంబ్లీ స్థానంలో నామినేషన్ దాఖలు చేసిన సీఎం మమతా బెనర్జీ

  • అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపాలైన మమతా బెనర్జీ
  • నందిగ్రామ్ లో చుక్కెదురు
  • సీఎంగా కొనసాగేందుకు గెలవాల్సిన అవసరం
  • భవానీపూర్ స్థానాన్ని త్యాగం చేసిన శోభన్ దేబ్
పశ్చిమ బెంగాల్ లో కీలకమైన ఉప ఎన్నికలు జరగనున్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం మమతా బెనర్జీ నందిగ్రామ్ స్థానం నుంచి పోటీచేసి ఓటమిపాలయ్యారు. దాంతో ఆమె సీఎంగా కొనసాగాలంటే ఎన్నికల్లో పోటీచేసి గెలవడం అనివార్యమైంది. ఈ నేపథ్యంలో భవానీపూర్ స్థానం నుంచి బరిలో దిగాలని మమతా బెనర్జీ నిర్ణయించారు. నేడు తన నామినేషన్ దాఖలు చేశారు.

భవానీపూర్ లో మమతా కోసం టీఎంసీ ఎమ్మెల్యే శోభన్ దేబ్ తన పదవికి రాజీనామా చేశారు. దాంతో ఈ అసెంబ్లీ స్థానంలో ఉప ఎన్నిక చేపడుతున్నారు.

భవానీపూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో మమతపై పోటీకి బీజేపీ ఓ యువ న్యాయవాదిని బరిలో దింపింది. ఆమె పేరు ప్రియాంకా టిబ్రేవాల్. ఇటీవల కాలంలో బెంగాల్ రాజకీయాల్లో ప్రియాంకా టిబ్రేవాల్ చురుగ్గా వ్యవహరిస్తున్నారు. అనేక అంశాల్లో తన గళం వినిపిస్తూ పార్టీ హైకమాండ్ దృష్టిలో పడ్డారు.
బెంగాల్ లో ఇటీవల ఎన్నికల అనంతరం హింసాకాండపై కలకత్తా హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేసినవారిలో ప్రియాంక కూడా ఉన్నారు. ఈ హింసపై కలకత్తా హైకోర్టు సీబీఐ దర్యాప్తుకు ఆదేశించడాన్ని బీజేపీ ఓ విజయంగా పరిగణిస్తోంది. ఈ క్రమంలోనే న్యాయవాది ప్రియాంకా టిబ్రేవాల్ సమర్థతను కాషాయదళం గుర్తించింది. అందుకే ఆమెను ఏకంగా సీఎం మమతా బెనర్జీపైనే పోటీకి దింపుతోంది.

కాగా, పశ్చిమ బెంగాల్ లో భవానీపూర్ తో పాటు షంషేర్ గంజ్, జాంగిపూర్ అసెంబ్లీ నియోజకవర్గాలకు ఈ నెల 30న ఎన్నికలు నిర్వహించనున్నారు. అక్టోబరు 3న ఫలితాలు వెల్లడిస్తారు.


More Telugu News