గుజరాత్ లో మరో కీలక పరిణామం.. అసెంబ్లీ స్పీకర్ రాజీనామా

  • రాజీనామాను అసెంబ్లీ సెక్రటరీకి పంపించిన రాజేంద్ర త్రివేది
  • రాజీనామా తక్షణమే అమల్లోకి వచ్చినట్టు ప్రకటించిన అసెంబ్లీ సెక్రటరీ
  • త్రివేదీకి మంత్రి పదవి ఇవ్వనున్నట్టు సమాచారం
వచ్చే ఏడాది గుజరాత్ అసెంబ్లీకి ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్ర రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. ఇటీవలే సీఎం పదవికి విజయ్ రూపానీ రాజీనామా చేశారు. అనంతరం ఆయన స్థానంలో భూపేంద్ర పాటిల్ ను ముఖ్యమంత్రిగా బీజేపీ అధిష్ఠానం నియమించింది. కాసేపట్లో భూపేంద్ర కేబినెట్ ప్రమాణస్వీకారం చేయనుంది. ఈ తరుణంలో ఈరోజు మరో ఆసక్తికర పరిణామం సంభవించింది. గుజరాత్ అసెంబ్లీ స్పీకర్ పదవికి రాజేంద్ర త్రివేది రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను అసెంబ్లీ సెక్రటరీకి పంపించారు.

ఆ తర్వాత పరిణామాలు కూడా వేగంగా మారిపోయాయి. స్పీకర్ రాజీనామా తక్షణమే అమల్లోకి వచ్చినట్టు అసెంబ్లీ సెక్రటరీ ప్రకటించారు. అయితే, రాజేంద్ర త్రివేది రాజీనామాకు గల కారణాలు ఇంతవరకు తెలియరాలేదు. రాజేంద్రకు మంత్రి పదవి ఇవ్వనున్నారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. కొత్త స్పీకర్ ఎవరనే విషయాన్ని కాసేపట్లో ప్రకటించనున్నట్టు సమాచారం.


More Telugu News