ఫుట్‌బాల్ మ్యాచ్‌ ఆడిన ఇంటర్‌పోల్ వాంటెడ్ క్రిమినల్

  • 60 ఏళ్ల వయసులో ఫుట్‌బాల్ ఆడిన రోనీ బ్రున్స్‌విక్
  • సురినామే క్లబ్ యజమాని, సహవ్యవస్థాపకుడు కూడా
  • డ్రగ్స్ ట్రాఫికింగ్ కేసులో వాంటెడ్ క్రిమినల్
అంతర్జాతీయ పోలీసుల (ఇంటర్‌పోల్) వాంటెడ్ లిస్టులో ఉన్న ఒక నేరగాడు ఫుట్‌బాల్ మ్యాచ్ ఆడాడు. తనను తాను కెప్టెన్‌గా నియమించుకొని 54 నిమిషాలపాటు మైదానంలో ఉన్నాడు. మంగళవారం సీవోఎన్‌సీఏసీఏఎఫ్ (కాన్‌కకాఫ్) లీగ్ సందర్భంగా సురినామే క్లబ్ మ్యాచ్‌లో ఈ దృశ్యం కనిపించింది. సురినామే క్లబ్ ఉపాధ్యక్షుడు, యజమాని అయిన రోనీ బ్రున్స్‌విక్ ఈ మ్యాచ్‌లో కనిపించాడు. ఇంటర్ మోంగెటోప్ జట్టు తరఫున అతనే మ్యాచ్ ప్రారంభించాడు.

సురినామే రాజధాని పరామారిబోలో జరిగిన ఈ మ్యాచ్‌లో 60 ఏళ్ల బ్రున్స్‌విక్ ఇంటర్ మోంగెటోప్ జట్టు సారధిగా వ్యవహరించాడు. మ్యాచ్‌లో 54 నిమిషాలపాటు ఉన్న బ్రున్స్‌విక్ ఏ మాత్రం ప్రభావం చూపలేదు. ఆ తర్వాత వేరే ఆటగాడు అతని స్థానంలో వచ్చాడు. ఈ మ్యాచ్‌లో అతని జట్టు 0-6 గోల్స్ తేడాతో ఘోరంగా ఓడిపోయింది. ఈ ఓటమిపై క్లబ్ అభిమానులు తీవ్రమైన నిరాశ వ్యక్తం చేశారు.

కాగా బ్రున్స్‌విక్ కోసం చాలా కాలంగా ఇంటర్‌పోల్ వెదుకుతోంది. డ్రగ్స్ ట్రాఫికింగ్ కేసులో అతనిపై కేసులు ఉన్నాయి. ఈ నేరంలోనే అతన్ని వాంటెడ్ నేరస్థుడిగా ఇంటర్‌పోల్ ప్రకటించింది. అలాంటి వ్యక్తి ఇలా ఫుట్‌బాల్ మ్యాచ్‌ ఆడటం అందరికీ ఆశ్చర్యం కలిగించింది.


More Telugu News