ఎస్పీ బాలుపై రూపొందించిన ప్రత్యేక గీతాన్ని ఆవిష్కరించిన ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు

  • ఢిల్లీలో అంతర్జాతీయ సంగీత సమ్మేళనం
  • హాజరైన వెంకయ్యనాయుడు
  • పిల్లల్లో బాలు సంస్కార బీజాలు నాటే ప్రయత్నం చేశారని వెల్లడి
  • బాలు వినమ్రత ఎందరికో ఆదర్శమని కితాబు
మహోన్నత గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ప్రథమ వర్ధంతి నేపథ్యంలో, ఢిల్లీలో నిర్వహించిన విశ్వ గాన గంధర్వ అంతర్జాతీయ సంగీత సమ్మేళనం కార్యక్రమానికి భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు హాజరయ్యారు. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంపై రూపొందించిన ప్రత్యేక గీతాన్ని ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పిల్లలకు మొదట సంస్కారం అలవాటు చేయాలని అన్నారు. పిల్లల్లో సంస్కార బీజాలు నాటేందుకు బాలు ప్రయత్నించారని వెల్లడించారు.

బాలు... గతం, వర్తమాన, భవిష్యత్ కాలాల మధ్య స్వర, సంస్కార వారధి వంటి వాడని వెంకయ్యనాయుడు కొనియాడారు. బాలు వినమ్రత ఎందరికో ఆదర్శం అని పేర్కొన్నారు. ఆ మహాగాయకుడి పాట నుంచే కాకుండా, మన సంస్కృతి, సంప్రదాయాల గురించి వారి మాట నుంచి కూడా ఈ తరం యువత, కళాకారులు స్ఫూర్తిపొందాలని సూచించారు.

బాలు జీవితం సినీ సంగీత చరిత్రలో ఓ మైలురాయి వంటిదని పేర్కొన్నారు. కథానాయకుల గాత్రంలోకి పరకాయ ప్రవేశం చేసి పాటలు పాడే బాలు ప్రతిభ అపురూపమైనదని కీర్తించారు. తెలుగు ప్రజల జీవితాల్లోనూ, ఆలయ సుప్రభాత సంగీత నివేదనల్లోనూ ఆయన స్వరం నిత్యం ధ్వనిస్తూనే ఉంటుందని కొనియాడారు. 


More Telugu News