సీఎం అని అరవద్దు.. పవర్ వచ్చిన తర్వాత పవర్ స్టార్ అని పిలవండి: అభిమానులకు పవన్ స్వీట్ వార్నింగ్

  • నేను సీఎం కావాలనే ఆకాంక్షను మీ మనసులో దాచుకోండి
  • వైసీపీ పాలనపై రెడ్డి సామాజికవర్గంలో కూడా బాధ ఉంది
  • నా కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు సజ్జల యత్నించారు
రాజమండ్రి సభలో పవన్ కల్యాణ్ ప్రసంగిస్తుండగా... 'సీఎం.. సీఎం' అంటూ జనసైనికులు నినాదాలు చేశారు. ఈ సందర్భంగా తన అభిమానులకు పవన్ స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. ఇలా ప్రతి చోటా 'సీఎం.. సీఎం' అని అరవద్దని చెప్పారు. ఈ మాటలు విని అలసిపోయానని అన్నారు. సీఎం అయినప్పుడే సీఎం అని అరవాలని చెప్పారు. తనను పవర్ స్టార్ అని కూడా పిలవద్దని... పవర్ లోకి వచ్చిన తర్వాతే పవర్ స్టార్ అని పిలవాలని సూచించారు. తాను సీఎం కావాలనే మీ ఆకాంక్షను మనసులో దాచుకోవాలని... ఇలా బయటకు చెప్పవద్దని అన్నారు.

వైసీపీ ప్రభుత్వంపై ఈ సందర్భంగా పవన్ విరుచుకుపడ్డారు. గుంతలు లేని రోడ్డు రాష్ట్రంలో ఒక్కటైనా ఉందా? అని ప్రశ్నించారు. కులాల పేరిట రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. కులాలను అడ్డంపెట్టుకుని బిచ్చం వేస్తామంటే కుదరదని అన్నారు. కమ్మ సామాజికవర్గాన్ని వర్గ శత్రువులుగా ప్రకటించి మొత్తం రాష్ట్రాన్నే అతలాకుతలం చేశారని చెప్పారు. వైసీపీ పాలనపై రెడ్డి సామాజికవర్గంలో కూడా బాధ ఉందని అన్నారు. తేలుకు పెత్తనమిస్తే అందరినీ కుళ్లబొడిచిందన్నట్టుగా.. అన్ని కులాలను వైసీపీ ప్రభుత్వం కుళ్లబొడుస్తోందని చెప్పారు.

వైసీపీ పాలనలో ఎవరికీ మాట్లాడే అధికారమే లేకుండా చేశారని... నోరు తెరిస్తే కొడతారని, తప్పుడు కేసులు పెట్టి జైల్లో పెడతారని మండిపడ్డారు. కడప జిల్లాలో నలుగురు బీజేపీ కార్యకర్తలను వైసీపీ నాయకులు హత్య చేశారని పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. జనసైనికులపై జరుగుతున్న దాడులకు అంతే లేదని అన్నారు.

ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తే ఊరుకునే వ్యక్తిని తాను కాదని పవన్ హెచ్చరించారు. తన కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు సజ్జల రామకృష్ణారెడ్డి యత్నించారని... పోలీసులకు ఫోన్ చేసి ఆటంకాలు సృష్టించే ప్రయత్నం చేశారని మండిపడ్డారు. తాడేపల్లి ప్యాలస్ లో ఉన్న జగన్ ను రోడ్డుపై నడిచి అవి ఎలా ఉన్నాయో చూడమని చెప్పాలని సజ్జలకు హితవు పలికారు.


More Telugu News