చివరి బంతికి సిక్సర్ కొట్టి సెంచరీ సాధించిన గైక్వాడ్... చెన్నై భారీ స్కోరు

  • అబుదాబిలో చెన్నై వర్సెస్ రాజస్థాన్
  • 60 బంతుల్లో 101 పరుగులు చేసిన గైక్వాడ్
  • 9 ఫోర్లు, 5 సిక్సులు బాదిన వైనం
  • 20 ఓవర్లలో 4 వికెట్లకు 189 పరుగులు చేసిన చెన్నై
రాజస్థాన్ రాయల్స్ తో మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ఇన్నింగ్స్ ఆరంభం నుంచి క్రీజులో ఉన్న గైక్వాడ్ కేవలం 60 బంతుల్లోనే 101 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఇన్నింగ్స్ చివరి బంతికి భారీ సిక్సర్ కొట్టిన గైక్వాడ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. గైక్వాడ్ ఇన్నింగ్స్ లో 9 ఫోర్లు, 5 భారీ సిక్సులున్నాయి.

కచ్చితమైన టైమింగ్, దూకుడు కలగలిసి గైక్వాడ్ నుంచి ఓ మెరుపు ఇన్నింగ్స్ ను ఆవిష్కరించాయి. గైక్వాడ్ సెంచరీ సాయంతో చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 189 పరుగులు చేసింది. ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా 15 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్ తో 32 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు.

అంతకుముందు ఓపెనర్ ఫాఫ్ డుప్లెసిస్ 25, మొయిన్ అలీ 21 పరుగులు చేశారు. సురేశ్ రైనా (3), అంబటి రాయుడు (2) విఫలమయ్యారు. రాజస్థాన్ బౌలర్లలో రాహుల్ తెవాటియా 3 వికెట్లు తీయగా, చేతన్ సకారియా 1 వికెట్ పడగొట్టాడు.


More Telugu News