వైజాగ్‌లో పర్యటిస్తున్న ప్రశాంత్ కిశోర్ బృందం.. పలు అంశాలపై వివరాల సేకరణ!

  • నామినేటెడ్ పదవులు కొందరికే దక్కడంపై నేతల్లో అసంతృప్తి
  • స్థానిక నేతల నుంచి అభిప్రాయాలు సేకరిస్తున్న పీకే బృందం
  • అది ఇచ్చే నివేదిక ఆధారంగా పార్టీని చక్కదిద్దాలని యోచన
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని ఇటీవల కలిసిన రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ అప్పుడే పని ప్రారంభించారు. ఆయన బృందం సభ్యులు రెండు రోజులుగా విశాఖపట్టణంలో పర్యటిస్తూ స్థానిక నేతల నుంచి వివరాలు సేకరిస్తున్నట్టు తెలుస్తోంది. నామినేటెడ్ పదవులు ఆశించి భంగపడిన కొందరు వైసీపీ నేతలు ఇటీవల తమ అసంతృప్తిని బాహాటంగానే వెల్లడించారు.

ఈ నేపథ్యంలో వాస్తవ పరిస్థితులు ఏమిటన్నదానిపై పీకే బృందం అభిప్రాయాలు సేకరిస్తోంది. పార్టీకి ఏళ్ల తరబడి సేవలు అందిస్తున్న తమను కాదని ఆర్థికంగా అండగా ఉన్నారన్న కారణంతో నామినేటెడ్ పదవులు వేరేవారికి ఇవ్వడం తగదని ఇటీవల కొందరు నేతలు ఓ సమావేశంలో బాహాటంగానే అసంతృప్తి వెళ్లగక్కారు.

 దీంతో రంగంలోకి దిగిన విజయసాయిరెడ్డి తరచూ సమావేశాలు ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు అందరి అభిప్రాయాలు తెలుసుకుంటానని హామీ ఇచ్చారు. అయినప్పటికీ కొందరు నేతల్లో అసంతృప్తి అలానే మిగిలి ఉంది. ఈ నేపథ్యంలో రంగంలోకి దిగిన పీకే బృందం స్థానిక వాస్తవ పరిస్థితులను క్షుణ్ణంగా పరిశీలిస్తోంది. అది ఇచ్చే నివేదికను బట్టి తదుపరి చర్యలు తీసుకోవాలని అధిష్ఠానం భావిస్తున్నట్టు తెలుస్తోంది.


More Telugu News