టీమిండియాకు ధోనీ ఫ్రీ సర్వీస్​.. ఒక్క పైసా కూడా తీసుకోవడం లేదట!

  • టీ20 వరల్డ్ కప్ కు మెంటార్ గా మాజీ కెప్టెన్
  • ఎలాంటి ఫీజునూ వసూలు చేయట్లేదన్న గంగూలీ
  • ఇదే విషయాన్ని స్పష్టం చేసిన జై షా
  • కెప్టెన్, వైస్ కెప్టెన్, కోచ్ తో చర్చించామని వెల్లడి
టీ 20 వరల్డ్ కప్ కోసం టీమిండియాకు మెంటార్ గా వ్యవహరిస్తున్న మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ.. ఒక్క పైసా కూడా తీసుకోవడంలేదని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ చెప్పారు. ఈ నెల 17 నుంచి యూఏఈ, ఒమన్ వేదికలుగా టీ20 వరల్డ్ కప్ జరగనున్న సంగతి తెలిసిందే. అందుకోసం టీమిండియాకు మెంటార్ గా ధోనీని బీసీసీఐ ఎంపిక చేసింది. ఈ నేపథ్యంలోనే తన సేవలకు దోనీ ఎలాంటి చార్జ్ చేయట్లేదని గంగూలీ చెప్పారు.

బీసీసీఐ సెక్రటరీ జై షా కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. ఎలాంటి గౌరవ వేతనాన్నీ తీసుకోవట్లేదన్నారు. రెండో దశ ఐపీఎల్ మొదలైనప్పుడు దుబాయ్ లో ధోనీతో చర్చించానని, పైసా తీసుకోకుండా మెంటార్ గా వ్యవహరించేదుకు ధోనీ ముందుకు వచ్చారని తెలిపారు. కేవలం టీ20 వరల్డ్ కప్ కోసమే ఆయన మెంటార్ గా వ్యవహరిస్తారన్నారు. కెప్టెన్, వైస్ కెప్టెన్, కోచ్ రవిశాస్త్రిలతో చర్చించాకే ధోనీని మెంటార్ గా నియమించారని, వారంతా తమ నిర్ణయానికి ఓకే చెప్పారని అన్నారు.

కాగా, మస్కట్, దుబాయ్, అబు ధాబి, షార్జా వేదికలుగా టీ20 వరల్డ్ కప్ మ్యాచ్ లు జరగనున్నాయి. ఈ నెల 24న పాకిస్థాన్ తో భారత్ తన తొలి మ్యాచ్ లో తలపడనుంది.


More Telugu News