ఓ కులాన్ని కించపరిచేలా వ్యాఖ్యలు.. టీమిండియా మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ అరెస్ట్

  • చాహల్‌తో లైవ్‌లో మాట్లాడుతూ కులవివక్ష వ్యాఖ్యలు
  • గతంలోనే క్షమాపణలు చెప్పిన యువీ
  • పంజాబ్-హర్యానా హైకోర్టు ఆదేశాలతో అరెస్ట్
  • అరెస్ట్ కాలేదన్న యువరాజ్ ప్రతినిధి
ఓ కులాన్ని కించపరిచేలా వ్యాఖ్యలు చేసినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ అరెస్టయ్యాడు. ఆపై బెయిలుపై విడుదలయ్యాడు. యువరాజ్ సింగ్ గతేడాది జూన్‌లో ఇన్‌స్టాగ్రామ్ లైవ్‌లో టీమిండియా లెగ్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్‌తో మాట్లాడుతూ కులవివక్ష వ్యాఖ్యలు చేసినట్టు ఆరోపణలున్నాయి. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో యువరాజ్‌పై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి.

ఈ నేపథ్యంలో అతడిపై కేసు నమోదు కాగా, పంజాబ్-హర్యానా హైకోర్టు ఆదేశాలతో పోలీసులు శనివారం యువరాజ్‌ను అరెస్ట్ చేశారు. ఆ తర్వాత సొంత పూచీకత్తుపై అతడిని విడుదల చేసినట్టు హర్యానాలోని హన్సికి చెందిన సీనియర్ పోలీసు అధికారి నిటికా గహ్లాట్ తెలిపారు. మరోవైపు, యువరాజ్ ప్రతినిధి షాజ్‌మీన్ కారా మాట్లాడుతూ యువరాజ్ అరెస్ట్ కాలేదని తెలిపారు. కాగా, యువరాజ్ గతంలోనే తన వ్యాఖ్యలకు చింతిస్తూ క్షమాపణలు కూడా తెలిపాడు.


More Telugu News