యూపీ ఎన్నికలు.. మహిళలు, యువతులే లక్ష్యంగా ప్రియాంక హామీలు

  • ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీకి వచ్చే ఏడాది ఎన్నికలు
  • ఇంటర్ పాసైతే స్మార్ట్‌ఫోన్, డిగ్రీ విద్యార్థినులకు స్కూటర్
  • ప్రియాంక తాజా ప్రకటనతో విద్యార్థినుల హర్షం
ఉత్తరప్రదేశ్‌లో వచ్చే ఏడాది జరగనున్న ఎన్నికల కోసం ప్రధాన రాజకీయ పార్టీలన్నీ ఇప్పటి నుంచే వ్యూహప్రతివ్యూహాల్లో మునిగిపోతున్నాయి. ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పావులు కదుపుతున్నాయి. ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ కాస్తంత ముందంజలోనే ఉంది. వచ్చే ఎన్నికల్లో మహిళలకు 40 శాతం సీట్లు కేటాయిస్తామని ప్రకటించిన ఆ పార్టీ తాజాగా, విద్యార్థినులకు స్కూటర్లు, సెల్‌ఫోన్లు అందిస్తామని ప్రకటించింది.

ఈ మేరకు ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ తెలిపారు. విద్యార్థినులు చదువుకోవడానికి, భద్రతకు స్మార్ట్‌ఫోన్లు అవసరమని అన్నారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే ఇంటర్ పాసైన విద్యార్థినులకు స్మార్ట్‌ఫోన్లు, డిగ్రీ విద్యార్థినులకు స్కూటీలు అందించాలని కాంగ్రెస్ నిర్ణయించిందని, ఎన్నికల మేనిఫెస్టోలో వీటిని చేర్చడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు.

ప్రియాంకగాంధీ ప్రకటనకు విద్యార్థినుల నుంచి అనూహ్య స్పందన వచ్చింది. దానిని ప్రియాంక తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. కష్టపడి చదువుకోవాలని ప్రియాంక తమతో చెప్పారని, ఆమె తమతో మాట్లాడడం, కలవడం వంటి వాటిని మున్ముందు కూడా కొనసాగించాలని విద్యార్థినులు మీడియాతో మాట్లాడుతూ చెప్పారు.


More Telugu News