హాలీవుడ్ సినిమా షూటింగ్ లో విషాదం.. ప్రముఖ నటుడి చేతిలో ‘ప్రాప్ గన్’ పేలి మహిళా సినిమాటోగ్రాఫర్ మృతి

  • న్యూమెక్సికోలో హాలీవుడ్ సినిమా ‘రస్ట్’ షూటింగ్
  • అలెక్ బాల్డ్ విన్ చేతిలో పేలిన డమ్మీ తుపాకీ
  • వెంటనే పోలీసుల దగ్గరకు వెళ్లిన బాల్డ్ విన్
హాలీవుడ్ సినిమా షూటింగ్ లో విషాదం చోటు చేసుకుంది. ‘రస్ట్’ అనే సినిమా షూటింగ్ సందర్భంగా ప్రముఖ నటుడు అలెక్ బాల్డ్ విన్ చేతిలోని డమ్మీ తుపాకీ (ప్రాప్ గన్) పేలి మహిళా సినిమాటోగ్రాఫర్ హల్యానా హచిన్స్ మరణించగా, డైరెక్టర్ జోయల్ సౌజా తీవ్రంగా గాయపడ్డారు.


ప్రమాదం జరిగిన వెంటనే ఇద్దరినీ హుటాహుటిన అంబులెన్సులో ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే హల్యానా చనిపోయిందని వైద్యులు నిర్ధారించారు. డైరెక్టర్ జోయల్ కు చికిత్స చేస్తున్నారు. ఈ ఘటన అమెరికాలోని న్యూమెక్సికోలో ఉన్న బొనాంజా క్రీక్ రాంచ్ లో జరిగింది.

ప్రస్తుతానికి ప్రమాదవశాత్తూ జరిగిన ఘటనగానే పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు. బాల్డ్ విన్ పై ఎలాంటి కేసూ నమోదు చేయలేదు. ఘటన జరిగిన వెంటనే ఆయనే స్వయంగా పోలీస్ స్టేషన్ కు వచ్చారని, విచారణకు సహకరించారని పోలీసులు తెలిపారు. ఆయన తన డిటెక్టివ్ లతో మాట్లాడుతున్నారని, ఘటన గురించి తలచుకుని తలచుకుని ఏడ్చారని ఆయన ప్రతినిధులు తెలిపారు.


కాగా, ఉక్రెయిన్ కు చెందిన హచిన్స్ చాలా కాలం పాటు ఆర్కిటిక్ సర్కిల్ లో సోవియట్ మిలటరీ బేస్ లో పెరిగి పెద్దయింది. కైవ్ లో జర్నలిజం చదివిన ఆమె.. లాస్ ఏంజిలిస్ లో సినిమాటోగ్రఫీపై శిక్షణ తీసుకుంది. గత ఏడాది విడుదలైన 'ఆర్కెనిమీ' అనే సినిమాకు సినిమాటోగ్రాఫర్ గా పనిచేసింది. ప్రస్తుతం పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు.


More Telugu News