బంగ్లాదేశ్ లో దుర్గామాత విగ్రహం పాదాల వద్ద ఖురాన్ ఉంచిన వ్యక్తి అరెస్ట్

  • ఇటీవల బంగ్లాదేశ్ లో మత విద్వేషాలు
  • ఆరుగురి మృతి.. హిందువులే లక్ష్యంగా దాడులు
  • సీసీటీవీ ఫుటేజి ఆధారంగా పోలీసుల దర్యాప్తు
  • ఇక్బాల్ హుస్సేన్ అనే వ్యక్తి అరెస్ట్
బంగ్లాదేశ్ లో ఇటీవల తీవ్ర అల్లర్లు చెలరేగి ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. ప్రధానంగా హిందువులపై పెద్ద ఎత్తున దాడులు జరిగాయి. ఈ అల్లర్లకు కారణం కుమిల్లా పట్టణంలో దుర్గామాత విగ్రహం పాదాల వద్ద ముస్లింలకు చెందిన పవిత్ర ఖురాన్ గ్రంథం ఉంచడమే. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో మతవిద్వేషాలు చెలరేగాయి.

కాగా, దుర్గామాత పాదాల వద్ద ఖురాన్ గ్రంథాన్ని పెట్టిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. అతడి పేరు ఇక్బాల్ హస్సేన్. సీసీటీవీ ఫుటేజి పరిశీలించిన అనంతరం నిందితుడిని పోలీసులు గుర్తించి, కాక్స్ బజార్ ప్రాంతంలో అతడిని అదుపులోకి తీసుకున్నారు. అరెస్ట్ చేసిన అనంతరం ఇక్బాల్ హుస్సేన్ ను కుమిల్లా తరలించారు. కాగా, దుర్గామాత పాదాల వద్ద ఖురాన్ ప్రతిని ఉంచిన ఇక్బాల్ అక్కడి హనుమంతుడి విగ్రహం వద్ద ఉన్న గదతో తిరిగి రావడం సీసీటీవీ ఫుటేజిలో కనిపించింది.

ఇక్బాల్ హుస్సేన్ మానసిక రోగి అని, డ్రగ్స్ కు బానిస అని బంగ్లాదేశ్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. అయితే, హోంమంత్రి అసద్ ఉజ్జమాన్ దీనిపై స్పందిస్తూ, ఈ వ్యవహారం మొత్తం ఓ పథకం ప్రకారం జరిగినట్టుగా భావిస్తున్నామని తెలిపారు. దుర్గామాత ఆలయంలో ఖురాన్ పెట్టిన వ్యక్తికి ఎవరో సూచనలు అందించి ఉంటారని పేర్కొన్నారు.


More Telugu News