ఆనాడు వెంకటేశ్వరస్వామి నన్ను ఏ ఉద్దేశంతో కాపాడాడో తెలియదు: చంద్రబాబు

  • టీడీపీ కార్యాలయంపై దాడి
  • 36 గంటల దీక్ష చేపట్టిన చంద్రబాబు
  • దీక్ష ముగింపు సందర్భంగా ప్రసంగం
  • సీఎం జగన్ పై విమర్శలు
వైసీపీ పాలన ఎంత అరాచకంగా ఉందో రాష్ట్ర ప్రజలందరికీ అర్థం కావాల్సిన పరిస్థితి ఉందని చంద్రబాబు పేర్కొన్నారు. చంద్రబాబు 36 గంటల దీక్ష ముగింపు సందర్భంగా మంగళగిరి టీడీపీ ఆఫీసులో ప్రసంగించారు. టీడీపీ ఆఫీసుపై దాడి ఎక్కడో అడివిలోనో, మారుమూల ప్రాంతంలోనో జరగలేదని... డీజీపీ ఆఫీసుకు దగ్గర్లోనే జరిగిందని తెలిపారు.

"ముఖ్యమంత్రి ఇల్లు కూడా ఇక్కడే ఉంది. ఓ పోలీసు బెటాలియన్ ఇక్కడే ఉంది. అయినా కూడా ప్రజాదేవాలయం వంటి టీడీపీ ఆఫీసుపై దాడి జరిగింది. మనం పోరాడింది డ్రగ్స్ విషయంలో. విదేశాల నుంచి డ్రగ్స్ వస్తోందని మీడియా కోడై కూసింది. పాడేరు ప్రాంతంలో గంజాయి సాగుచేస్తున్నారు, దేశం మొత్తానికి ఇక్కడ్నించే సరఫరా చేసే పరిస్థితులున్నాయి. యువత భవిష్యత్తు కోసమే మేం పోరాడుతున్నాం. ఒక్కసారి గంజాయి, హెరాయిన్ లకు అలవాటు పడితే పిల్లలు ఏమవుతారోనన్న ఆందోళనతో ప్రజలకు జాగ్రత్తలు చెప్పాను. ఈ గుడ్డి ముఖ్యమంత్రికి ఆ మాత్రం తెలియదా? డ్రగ్స్ పై సమీక్ష నిర్వహించే సమయం లేదా?

వీళ్లకు భయపడి ప్రశ్నించడం మానుకోవాలా? అసలు మద్యం బ్రాండ్లను మార్చేందుకు ఏ సీఎం అయినా సాహసించాడా? కానీ వీళ్లు మార్చారు. రూ.60 ఉన్న మద్యాన్ని రూ.200కి పెంచారు. ప్రజలను మద్యానికి బానిసలుగా మార్చుతున్నారు. ఆడబిడ్డల జీవితాలతో ఆడుకుంటున్నారు. దశలవారీగా మద్యపాన నిషేధం విధిస్తానని జగన్ చెప్పారా లేదా? అని ప్రశ్నించారు. మద్యం విధానాన్ని క్రమబద్ధీకరించిన ఘనత ఎన్టీఆర్ కి దక్కిందని అన్నారు.

సమైక్యాంధ్ర ప్రదేశ్ లో తానే ఎక్కువ కాలం ముఖ్యమంత్రిగా ఉన్నానని చంద్రబాబు వెల్లడించారు. "రాష్ట్రంలో తీవ్రవాదం, ముఠా రాజకీయాలు, మత విద్వేషాలు ఉండకూడదని పోరాడాను. ఈ క్రమంలో ప్రాణాలు లెక్కచేయలేదు. అలిపిరి వద్ద 24 క్లేమోర్ మైన్లు పేల్చినా సాక్షాత్తు ఆ వెంకటేశ్వరస్వామి నన్ను కాపాడాడు. ఆయన నన్ను ఏ ఉద్దేశం కోసం కాపాడాడో తెలియదు. అప్పుడే నేను భయపడలేదు... ఇప్పుడు భయపడతానా?

ఇవాళ ముఖ్యమంత్రి ఏం మాట్లాడుతున్నాడో చూశారా? వాళ్ల తల్లిని పట్టాభి తిట్టాడంట! నా 40 ఏళ్ల రాజకీయంలో ఎవరినీ బూతులు తిట్టలేదు. నేను రాజకీయం మొదలుపెట్టే సమయంలో జగన్ చిన్న పిల్లవాడు. నోట్లో వేలు పెట్టుకుని సీసాలో పాలు తాగుతూ ఉండి ఉంటాడు. ఇప్పుడు మంత్రులతో సహా ప్రతి ఒక్కరూ బూతులు మాట్లాడేవాళ్లే. వీళ్ల తప్పులు ఎండగడుతున్నానని నాపై పడుతున్నారు" అంటూ తీవ్రస్థాయిలో స్పందించారు.


More Telugu News