ఏపీలో మరో ఆలయానికి అపచారం జరిగిందంటూ వీడియోను పోస్ట్ చేసిన లోకేశ్

  • పాతపట్నం శ్రీనీలమణి దుర్గమ్మ ఆలయం వద్ద ఘటన
  • బుల్డోజర్ తో సింహద్వారం కూల్చివేత
  • విగ్రహాలు తరలించుకుంటామన్నా టైం ఇవ్వలేదని మండిపాటు
  • ఇది ప్రభుత్వ విధ్వంసమేనని ఆగ్రహం
ఆంధ్రప్రదేశ్ లో మరో ఆలయానికి అపచారం జరిగిందంటూ తెలుగుదేశం నేత నారా లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. విగ్రహాలను తీసుకెళ్తామని స్థానికులు చెప్పినా వినిపించుకోకుండా బుల్డోజర్లతో ఆంధ్రా–ఒడిశా ప్రజల ఇలవేల్పు, ఉత్కళాంధ్రుల ఆరాధ్యదైవం పాతపట్నంలోని శ్రీనీలమణి దుర్గమ్మ వారి ఆలయ ప్రహరీ, సింహద్వారాన్ని కూల్చి వేశారని, అది దారుణమైన చర్య అని మండిపడ్డారు.

అదే పాతపట్నంలోని ఆంజనేయుడు, వినాయకుడి విగ్రహాలను తరలించుకుంటామని ప్రజలు, భక్తులు వేడుకున్నా రోడ్డు విస్తరణ పేరుతో సమయం ఇవ్వకుండా కూల్చివేయడం.. హిందూ దేవాలయాల పట్ల ప్రభుత్వం ఎలాంటి మనస్తత్వంతో ఉందో చెబుతుందని విమర్శించారు. ఆలయాల ధ్వంసం గురించి వైసీపీ ఎమ్మెల్యేకి చెప్పినా పట్టించుకోలేదంటూ భక్తులు చెప్పారని ఆయన ఆరోపించారు. ఇది ముమ్మాటికీ ప్రభుత్వానికి తెలిసి జరిగిన విధ్వంసమేనని మండిపడ్డారు.
 
సీఎం వైఎస్ జగన్ పాలనలో అంతర్వేది రథం దగ్ధం, రామతీర్థంలో రాముడి విగ్రహ తల ధ్వంసం వంటి ఘటనలతో రెండున్నరేళ్లలోనే హిందూ ధర్మాన్ని మంటగలిపారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేవుళ్లకు తీరని అపచారం తలపెట్టారన్నారు.


More Telugu News