'ఓసీఎఫ్ఎస్' అంటే ఏంటి?... ఇదిగో నిహారిక సమాధానం

  • వెబ్ సిరీస్ కు నిర్మాతగా కొణిదెల నిహారిక
  • 'ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ' నిర్మించిన వైనం
  • నవంబరు 19న తొలి ఎపిసోడ్
  • జీ5 ఓటీటీలో ప్రసారం
ఇటీవల కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో 'ఓసీఎఫ్ఎస్' అనే హ్యాష్ ట్యాగ్ విపరీతంగా ట్రెండ్ అవుతోంది. మెగాబ్రదర్ నాగబాబు తనయ నిహారిక సరికొత్త వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు వస్తుండగా... ఆ వెబ్ సిరీస్ పేరే 'ఓసీఎఫ్ఎస్'. దీన్ని పూర్తిగా విడమర్చితే ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ అని అర్థం. ఈ మేరకు ఓ ఇంటర్వ్యూలో నిహారిక వెల్లడించారు. ఇదే విషయాన్ని ట్విట్టర్ లోనూ పంచుకున్నారు.  

ఈ వెబ్ సిరీస్ లో సంతోష్ శోభన్, సిమ్రాన్ శర్మ హీరోహీరోయిన్లు. మహేశ్ ఉప్పల దర్శకత్వంలో వస్తున్న ఈ వెబ్ సిరీస్ కు నిహారిక నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. తన తండ్రి నాగబాబు పుట్టినరోజు సందర్భంగా 'ఓసీఎఫ్ఎస్' ఫస్ట్ లుక్ ను ఆవిష్కరించారు.

ఈ వెబ్ సిరీస్ లో టాలీవుడ్ సీనియర్ నటులు నరేశ్, తులసి కీలకపాత్రలు పోషించారు. ఈ వెబ్ సిరీస్ లో 40 నిమిషాల నిడివితో 5 ఎపిసోడ్లు ఉంటాయి. కేవలం జీ5 ఓటీటీ వేదికపైనే ప్రసారం కానుంది. నవంబరు 19న తొలి ఎపిసోడ్ ప్రీమియర్స్ ఉంటుందని నిహారిక ట్విట్టర్ లో వెల్లడించారు.


More Telugu News