వరంగల్‌లో డ్రగ్స్ కలకలం.. డ్రగ్స్ విక్రయిస్తున్న ఇంజినీరింగ్ విద్యార్థి సహా ఆరుగురి అరెస్ట్

  • డ్రగ్స్‌కు అలవాటు పడిన ఇంజినీరింగ్ విద్యార్థి
  • ఆపై గోవా వెళ్లి డ్రగ్స్ కొనుగోలు చేసి యువకులు, విద్యార్థులకు విక్రయం
  • హైదరాబాద్‌కు చెందిన వ్యక్తితో కలిసి దందా
  • పక్కా సమాచారంతో దాడి చేసి పట్టుకున్న పోలీసులు
వరంగల్‌లో విద్యార్థులు, యువకులకు డ్రగ్స్ విక్రయిస్తున్న పలువురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. డ్రగ్స్ కొనుగోలు చేస్తున్న వారికి కూడా పోలీసులు అరదండాలు వేశారు. మొత్తం ఆరుగురు వ్యక్తులను అరెస్ట్ చేసినట్టు పోలీసులు తెలిపారు. వారిలో నగరంలోని పిన్నావారివీధికి చెందిన శివ్వ రోహన్, హైదరాబాద్‌లోని మాదాపూర్‌కు చెందిన పెంచికల కాశీరావుతోపాటు డ్రగ్స్ కొనుగోలు చేస్తున్న నలుగురు వ్యక్తులు ఉన్నారు.

నిందితుల నుంచి గ్రామున్నర కొకైన్, 15 గ్రాముల చరస్‌, 36 ఎల్ఎస్‌డీ పేపర్లు, మత్తు కలిగించే మాత్రలు, గంజాయి నుంచి తీసిన నూనె, గంజాయిని పొడిచేసే పరికరం, హుక్కా సామగ్రి, ఆరు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ.3.16 లక్షల వరకు ఉంటుందని పోలీసులు పేర్కొన్నారు.

నిందితుల్లో ఒకడైన రోహన్ బీటెక్ స్టూడెంట్. డ్రగ్స్‌కు అలవాటు పడిన రోహన్ ఆ తర్వాత వాటిని సరఫరా చేయడం మొదలుపెట్టాడు. గోవా వెళ్లి నైజీరియాకు చెందిన జాక్, కాల్‌జోఫర్‌ల నుంచి కొకైన్, చరస్‌తోపాటు ఇతర మత్తుపదార్థాలను కొనుగోలు చేసి తీసుకొచ్చేవాడని, స్నేహితులతో కలిసి వాటిని వరంగల్‌లో విక్రయించేవాడని పోలీసులు తెలిపారు.

మరో నిందితుడైన కాశీరావుది హైదరాబాద్. ఓ ప్రైవేటు సంస్థలో ఉద్యోగం చేస్తున్న అతడు గోవాలో మత్తు పదార్థాలు కొనుగోలు చేసేవాడు. ఇద్దరికీ పరిచయం ఏర్పడడంతో కలిసి దందా నిర్వహించడం మొదలుపెట్టారు. నగరంలోని లాడ్జ్‌లలో తమ కార్యకలాపాలు నిర్వహించేవారు. వీరి డ్రగ్స్ దందాపై సమాచారం అందుకున్న సుబేదారి, టాస్క్‌ఫోర్స్ పోలీసులు నక్కలగుట్టలోని లాడ్జి‌పై దాడులు నిర్వహించి అదుపులోకి తీసుకున్నారు.


More Telugu News