మ‌రింత ముదిరిన వివాదం.. ఫ‌డ్న‌వీస్‌కు న‌వాబ్ మాలిక్ అల్లుడు నోటీసులు

  • రూ.5 కోట్ల న‌ష్ట‌ప‌రిహారం కోరుతూ లీగల్ నోటీసులు
  • లాయ‌ర్ రెహ్మాత్ అన్సారీ ద్వారా పంపిన మాలిక్ అల్లుడు
  • డ్ర‌గ్స్ కేసులో త‌న‌పై త‌ప్పుడు  ప్ర‌చారం చేశార‌ని మండిపాటు
మ‌హారాష్ట్ర మంత్రి న‌వాబ్ మాలిక్, ఆ రాష్ట్ర మాజీ సీఎం దేవేంద్ర ఫ‌డ్న‌వీస్ మ‌ధ్య కొన్ని రోజులుగా మాట‌ల తూటాలు పేలుతోన్న విష‌యం తెలిసిందే. ఒక‌రిపై ఒక‌రు తీవ్ర ఆరోప‌ణ‌లు గుప్పించుకుంటున్నారు. ఈ నేప‌థ్యంలో తాము రూ.5 కోట్ల న‌ష్ట‌ప‌రిహారం కోరుతూ ఫ‌డ్న‌వీస్‌కు లీగల్ నోటీసులు ఇచ్చినట్టు న‌వాబ్ మాలిక్ తెలిపారు. ఇందుకు సంబంధించిన లీగ‌ల్ నోటీసుల‌ను త‌న అల్లుడు స‌మీర్ ఖాన్ ఇచ్చిన‌ట్లు వివ‌రించారు.

ఇందుకు సంబంధించిన కాపీని  మాలిక్ కూతురు నీలోఫ‌ర్ మాలిక్ ఖాన్ మీడియాకు చూపించారు. లాయ‌ర్ రెహ్మాత్ అన్సారీ ద్వారా ఆ నోటీసులు పంపిన‌ట్లు వివ‌రించారు. జ‌న‌వ‌రి 13న స‌మీర్ ఖాన్‌ను ఎన్సీబీ అధికారులు డ్ర‌గ్ కేసులో అరెస్టు చేసి, సెప్టెంబ‌రు 27న విడుద‌ల చేశారు. దాన్ని గుర్తు చేస్తూ మాలిక్ అల్లుళ్లు డ్ర‌గ్స్‌తో దొరికార‌ని ఫ‌డ్న‌వీస్ విమ‌ర్శ‌లు గుప్పించారు.

ఆయ‌న చేసిన వ్యాఖ్య‌ల‌పై మాలిక్ అల్లుళ్లు మండిప‌డ్డారు. ఎన్సీబీ దాఖ‌లు చేసిన చార్జీషీట్‌లో త‌మ‌పై ఎటువంటి ఆరోప‌ణ‌లు లేవ‌ని చెప్పారు. త‌మ ఇంట్లో మాద‌క ద్ర‌వ్యాలు దొర‌క‌లేద‌ని అన్నారు. త‌మ‌పై త‌ప్పుడు ప్ర‌చారం చేస్తున్నార‌ని లీగ‌ల్ నోటీసులో మాలిక్ అల్లుడు స‌మీర్ ఖాన్ పేర్కొన్నారు.

తాము ప్ర‌స్తుతం ఫ‌డ్న‌వీస్ స్పంద‌న కోసం ఎదురుచూస్తున్నామ‌ని తెలిపారు. ఆయ‌న స్పందించిన త‌ర్వాత త‌దుప‌రి చ‌ర్య‌లు ప్రారంభిస్తామ‌ని మాలిక్ కూతురు అన్నారు. ఫ‌డ్న‌వీస్ క్ష‌మాప‌ణ‌లు చెప్ప‌కుంటే, తాము న‌ష్ట‌ప‌రిహారం దావాతో కోర్టుకు వెళ్ల‌నున్న‌ట్లు చెప్పారు.


More Telugu News