సముద్రంలో బోటు బోల్తాపడినా.. అతికష్టం మీద గాయాలతో ఒడ్డుకు చేరుకున్న విశాఖ జిల్లా మత్స్యకారులు!

  • తుపాను హెచ్చరికల గురించి తెలియక సముద్రంలోకి వెళ్లిన మత్స్యకారులు
  • ఒడ్డుకు చేరేందుకు విశ్వప్రయత్నం
  • అలల తాకిడికి బోల్తాపడిన బోటు
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తుపానుకు సంబంధించిన హెచ్చరికలను వాతావరణశాఖ ముందుగానే జారీ చేసింది. అయితే, ఈ విషయం తెలియని కొందరు మత్స్యకారులు సముద్రంలోకి చేపల వేటకు వెళ్లారు. చావు అంచుల వరకు వెళ్లి వీరు అతికష్టం మీద ఒడ్డుకు చేరుకున్నారు.

వివరాల్లోకి వెళ్తే, విశాఖ జిల్లా పాయకరావుపేట మండలం ఎస్.రాయవరంకు చెందిన ఆరుగురు మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లారు. అల్లకల్లోలంగా ఉన్న సముద్రంలో వారు చిక్కుకుపోయారు. ప్రమాదకరంగా ఉన్న వాతావరణంలో వారు ఒడ్డుకు చేరుకునేందుకు విశ్వప్రయత్నం చేశారు. రేపుపోలవరం వద్ద అలల తాకిడికి వారి పడవ బోల్తాపడింది. అందరూ సముద్రంలో పడిపోయారు. వీరంతా అతికష్టం మీద పడవను తీసుకుని ఒడ్డుకు చేరారు. అయితే విలువైన వలలు మాత్రం సముద్రంలో కొట్టుకుపోయాయి. ప్రమాదం సందర్భంగా గాయపడ్డ వీరు ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు.

మరోవైపు నెల్లూరు జిల్లాలో కూడా సముద్రంలో సాంకేతిక కారణాలతో ఒక బోటు చిక్కుకుపోయింది. బోటులో 11 మంది మత్స్యకారులు ఉన్నారు. వీరంతా అల్లూరు మండలం తాటిచెట్లవారిపాలెం గ్రామానికి చెందినవారు. సమాచారం అందుకున్న కృష్ణపట్నం కోస్ట్ గార్డ్స్ మత్స్యకారులను రక్షించేందుకు యత్నిస్తున్నారు.


More Telugu News