తమిళనాడులో మళ్లీ మొదలైన వర్ష బీభత్సం... నెక్ట్స్ మన వంతు..?

  • బంగాళాఖాతంలో అల్పపీడన పరిస్థితులు
  • తమిళనాడులోని నాలుగు జిల్లాలకు రెడ్ అలర్ట్
  • స్కూళ్లకు సెలవులు ప్రకటించిన తమిళనాడు సర్కారు
  • తూత్తుకుడి ఎయిర్ పోర్టులో నిలిచిన విమానాల రాకపోకలు
ఇటీవల కాలంలో ఎక్కువగా బంగాళాఖాతంలో అల్పపీడనాలు ఏర్పడడం, అవి మొదట తమిళనాడు మీద ప్రభావం చూపుతూ, క్రమంగా తీరానికి దగ్గరగా వస్తూ ఏపీ పైనా విరుచుకుపడడం తెలిసిందే. అవడానికి అల్పపీడనాలే అయినా అవి కురిపించిన అతి భారీ వర్షాలతో ఏపీలోని దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాలు ఇప్పటికీ తేరుకోలేదు. ఈ నేపథ్యంలో బంగాళాఖాతంలో మరో అల్పపీడనం అంటూ వాతావరణ శాఖ హెచ్చరికలు ప్రజలను మరింత ఆందోళనకు గురిచేస్తున్నాయి.

తాజా సమాచారం ప్రకారం తమిళనాడులో మళ్లీ వర్షాలు మొదలయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారత వాతావరణ సంస్థ (ఐఎండీ) తూత్తుకుడి, తేన్ కాశి, తిరునల్వేలి, చెంగల్పట్టు జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించింది. ఐఎండీ అలర్ట్ నేపథ్యంలో రాష్ట్ర సర్కారు ఆ నాలుగు జిల్లాల్లో పాఠశాలలకు సెలవు ప్రకటించింది.  తూత్తుకుడిలో ఎడతెరిపి లేని వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాల ధాటికి తూత్తుకుడి ఎయిర్ పోర్టులో రన్ పైకి భారీగా నీరు చేరింది. దాంతో విమానాల రాకపోకలు నిలిచిపోయాయి. పలు విమానాలను దారి మళ్లించారు.

ఇటు, ఏపీలో ఈ నెల 26 నుంచి వర్షాలు మొదలవుతాయని, 27న నెల్లూరు, ప్రకాశం, చిత్తూరు, కడప జిల్లాల్లో అతి  భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ఇప్పటికే అంచనా వేసింది. గుంటూరు, కృష్ణా, అనంతపురం జిల్లాల్లోనూ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.


More Telugu News