చైనాను వెన‌క్కు త‌గ్గేలా చేసిన భార‌త్‌.. కీల‌క ప్రాజెక్ట్ నిలిపివేత‌

  • శ్రీ‌లంక‌లోని మూడు దీవుల్లో చైనా ప్రాజెక్టు
  • హైబ్రిడ్ పున‌రుత్పాద‌క విద్యుత్ ప్లాంట్ల ప్రాజెక్టుకు గ‌తంలో శ్రీ‌కారం
  • నిర‌స‌న వ్య‌క్తం చేసిన భార‌త్
  • ఆ ప్రాజెక్టును నిలిపేస్తూ భార‌త్‌పై చైనా ఆరోప‌ణ‌లు
శ్రీ‌లంక‌లోని మూడు దీవుల్లో హైబ్రిడ్ పున‌రుత్పాద‌క విద్యుత్ ప్లాంట్ల ప్రాజెక్టు చేప‌ట్టిన చైనా ఆ నిర్మాణాల‌ను నిలిపివేసేంది. ఈ మేర‌కు తాజాగా శ్రీ‌లంక‌లోని చైనా రాయ‌బార కార్యాల‌యం ట్వీట్ చేసింది. త‌మిళ‌నాడుకు స‌మీపంలో ఉండే శ్రీ‌లంక‌లోని మూడు దీవుల్లో చైనా చేప‌ట్టిన ప్రాజెక్టుల‌పై గ‌తంలో భార‌త్ నిర‌స‌న వ్య‌క్తం చేసింది. ఈ నేప‌థ్యంలో చైనా వెన‌క్కు త‌గ్గ‌డం గ‌మ‌నార్హం.  

తాజాగా, శ్రీ‌లంక‌లోని చైనా రాయ‌బార కార్యాల‌యం ట్విట్ట‌ర్‌లో భార‌త్ పేరును ప్ర‌స్తావించ‌కుడా థ‌ర్డ్ పార్టీ అంటూ సంబోధిస్తూ ఓ ప్ర‌క‌ట‌న చేసింది. చైనాకు చెందిన సినో సోర్‌ హైబ్రిడ్‌ టెక్నాలజీ సంస్థ‌.. శ్రీలంకలోని డెల్ఫ్ట్‌, నాగదీప, అనల్‌థివు దీవుల్లో  హైబ్రిడ్ పున‌రుత్పాద‌క విద్యుత్ ప్లాంట్ల ప్రాజెక్టు నిర్మాణ కాంట్రాక్టును ఈ ఏడాది జ‌న‌వ‌రిలో ద‌క్కించుకుంద‌ని శ్రీ‌లంక‌లోని చైనా రాయ‌బార కార్యాల‌యం గుర్తు చేసింది.

థ‌ర్డ్ పార్టీ నుంచి భ‌ద్ర‌తాప‌ర ఆందోళ‌న వ్యక్తమ‌వుతోన్న నేప‌థ్యంలో ఆ ప్రాజెక్టును నిలిపివేస్తూ చైనా నిర్ణ‌యం తీసుకుంద‌ని వివ‌రించింది. సినో సోర్‌ కంపెనీ కూడా ఈ మేర‌కు ఓ ప్రకటన విడుదల చేసింది. చైనా విద్యుత్ ప్లాంట్లు ఏర్పాటు చేయాలనుకున్న శ్రీ‌లంక‌లోని ఆ మూడు దీవులు తమిళనాడుకు స‌మీపంలో ఉండ‌డంతో అప్ప‌ట్లో భారత్‌ నిరసన తెలుపుతూ ప్ర‌క‌ట‌న చేసింది.

ఇటీవ‌ల‌ అంతర్జాతీయ సమాజం నుంచి కూడా చైనాపై ఒత్తిడి పెరగడంతో డ్రాగ‌న్ దేశం ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు తెలుస్తోంది. అదే స‌మ‌యంలో భారత్‌ను థ‌ర్డ్ పార్టీ అంటూ పేర్కొంటూ ప‌లు ఆరోప‌ణ‌లు చేసింది. శ్రీ‌లంకతో ఒప్పందాల విషయంలో బయటి దేశం జోక్యం పెరిగింద‌ని చెప్పుకొచ్చింది. కాగా, శ్రీ‌లంక‌లో నిలిపేసిన ఈ  ప్రాజెక్టును మాల్దీవుల సముదాయంలో నిర్మించబోతున్నట్లు సినో సోర్‌ హైబ్రిడ్‌ టెక్నాలజీ సంస్థ మ‌రో ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది.


More Telugu News