పిల్లలకు వచ్చే మూర్ఛ వ్యాధిలో ఇదో రకం!

  • గెలాస్టిక్ సీజర్స్ వ్యాధిలో ఇలానే ఉంటుంది
  • మెదడులో కణతి కారణంగా ఈ సమస్య
  • కామినేని ఆసుపత్రిలో మూడేళ్ల చిన్నారికి శస్త్రచికిత్స
పిల్లలు ఒక్కచోట చేరారంటే వారి అల్లరికి ఇల్లు దద్దరిల్లి పోవాల్సిందే. ఒక్కరే ఉన్నా వారు ఏదో ఒక అల్లరి చేస్తూ, ఇంట్లో కొత్తగా, ఆసక్తిగా కనిపించినవి పీకి పెడుతుంటారు. ఇల్లంతా చిందర వందర చేస్తుంటారు. ఇదంతా అసాధారణమేమీ కాదు.

కానీ, ఎక్కడో అరుదుగా ఒంటరిగా చిన్నారి తనలో తానే నవ్వుకుంటూ, మాట్లాడుకుంటూ కనిపించడం చూసే ఉంటారు. కారణం లేకుండా పిల్లలు తమంతట తామే ఎప్పుడూ నవ్వుతూ కనిపించినా, గొణుక్కుంటూ వున్నా సందేహించాల్సిందేనంటున్నారు వైద్యులు. ఎందుకంటే ఇది ఒకరకం మూర్ఛ (ఎపిలెప్సి) వ్యాధి కావచ్చని కామినేని ఆసుపత్రి (ఎల్ బీనగర్) న్యూరో సర్జన్ అయిన డాక్టర్ రమేశ్ అంటున్నారు.

గెలాస్టిక్ సీజర్స్ సమస్య ఉన్న వారు.. వారిలో వారే నవ్వుకోవడం, గొణుగుకోవడం చేస్తుంటారట. ‘‘మెదడులోని హైపోథాలమస్ అనే భాగంలో కణతి ఏర్పడడం గెలాస్టిక్ సీజర్స్ సమస్యకు దారితీస్తుంది’’ అని డాక్టర్ రమేశ్ వివరించారు. అరుదుగా రెండు లక్షల మందిలో ఒక చిన్నారికి ఈ సమస్య వస్తుందని తెలిపారు.

ఇటువంటి సమస్యతో బాధపడుతున్న మూడేళ్ల బాలికకు డాక్టర్ రమేశ్ ఆధ్వర్యంలోని వైద్య బృందం తాజాగా శస్త్రచికిత్స నిర్వహించింది. అకారణంగా నవ్వడమే కాకుండా, ఎదుటివారిని గుర్తు పట్టలేకపోవడం, పట్టించుకోకపోవడం చేస్తున్న చిన్నారిని తల్లిదండ్రులు ఆసుపత్రికి తీసుకువచ్చారు. ఎంఆర్ఐ స్కానింగులో మెదడులోని హైపోథాలమస్ భాగంలో కణతి ఉన్నట్టు తేలింది. దీంతో శస్త్రచికిత్స ద్వారా దానిని తొలగించారు.


More Telugu News