ధోనీ రికార్డును అధిగమించిన పంత్

  • అతి వేగంగా 100 మందిని అవుట్ చేసిన పంత్
  • 26 టెస్టుల్లోనే ఈ ఘనత
  • గతంలో 36 టెస్టుల్లో ఈ ఘనత అందుకున్న ధోనీ 
టీమిండియా యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్ విశిష్ట ఘనతను సొంతం చేసుకున్నాడు. దక్షిణాఫ్రికాతో సెంచురియన్ లో జరుగుతున్న తొలి టెస్టు ద్వారా పంత్... టీమిండియా వికెట్ కీపింగ్ దిగ్గజం మహేంద్ర సింగ్ ధోనీ రికార్డును అధిగమించాడు. తక్కువ మ్యాచ్ లలో 100 మందిని అవుట్ చేసిన భారత వికెట్ కీపర్ గా చరిత్ర పుటల్లోకెక్కాడు. ధోనీ ఈ ఘనతను 36 టెస్టుల్లో అందుకోగా, 23 ఏళ్ల పంత్ 26 టెస్టుల్లోనే ఈ ఘనత నమోదు చేయడం విశేషం.

అయితే ఈ విషయంలో సఫారీ వికెట్ కీపర్ క్వింటన్ డికాక్ అందరికంటే ముందున్నాడు. డికాక్ కేవలం 22 టెస్టుల్లో 100 మందిని అవుట్ చేయడంలో పాలుపంచుకున్నాడు. కాగా, ఇప్పటివరకు ఆరుగురు భారత వికెట్ కీపర్లు 100 పైచిలుకు అవుట్లలో భాగస్వాములయ్యారు. పంత్ కంటే ముందే ధోనీ, సయ్యద్ కిర్మానీ, కిరణ్ మోరే, నయన్ మోంగియా, వృద్ధిమాన్ సాహా 100 క్లబ్ లో చేరారు.


More Telugu News