రెండో ఇన్నింగ్స్ లో టీమిండియా 174 ఆలౌట్... దక్షిణాఫ్రికా లక్ష్యం 305 రన్స్

  • ఆసక్తికరంగా సెంచురియన్ టెస్టు
  • పేసర్లకు బాగా సహకరిస్తున్న పిచ్
  • నిప్పులు చెరిగిన రబాడా, జాన్సెన్
  • లక్ష్యఛేదనకు ఉపక్రమించిన సఫారీలు
సెంచురియన్ టెస్టు రసవత్తరంగా మారింది. టీమిండియా రెండో ఇన్నింగ్స్ లో 174 పరుగులకే ఆలౌట్ అయింది. తద్వారా దక్షిణాఫ్రికా ముందు 305 పరుగుల విజయలక్ష్యాన్ని ఉంచింది. పిచ్ పేసర్లకు విశేషంగా సహకరిస్తున్న నేపథ్యంలో లక్ష్యఛేదన ఏమంత సులువుగా కనిపించడంలేదు.

టీమిండియా రెండో ఇన్నింగ్స్ లో సఫారీ పేసర్లు కగిసో రబాడా, మార్కో జాన్సెన్ నిప్పులు చెరిగారు. వీరిద్దరూ చెరో 4 వికెట్లు తీశారు. ముఖ్యంగా, కెరీర్ లో తొలి టెస్టు ఆడుతున్న లెఫ్టార్మ్ సీమర్ మార్కో జాన్సెన్ అద్భుతంగా బౌలింగ్ చేసి టీమిండియా లైనప్ ను దెబ్బతీశాడు. మరో పేసర్ లుంగి ఎంగిడికి 2 వికెట్లు దక్కాయి.

టీమిండియా ఇన్నింగ్స్ లో అత్యధికంగా రిషబ్ పంత్ 34 పరుగులు చేశాడు. వేగంగా ఆడిన పంత్ 34 బంతులు ఎదుర్కొని 6 బౌండరీలు బాదాడు. రహానే సైతం ధాటిగానే ఆడాడు. రహానే 23 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్ సాయంతో 20 పరుగులు రాబట్టాడు.

కాగా, ఇవాళ్టి ఆటలో సఫారీ పేసర్లకు వికెట్లు లభించిన విధానం టీమిండియా పేసర్లలోనూ ఉత్సాహం కలిగిస్తోంది. పిచ్ పై బౌన్స్ ను ఉపయోగించుకుని దక్షిణాఫ్రికన్ల పనిబట్టాలని భారత ఫాస్ట్ బౌలర్లు తహతహలాడుతున్నారు.


More Telugu News