నేటి నుంచి వీటి కోసం కాస్త అధికంగా చెల్లించుకోవాల్సిందే..!

  • ఏటీఎం లావాదేవీలపై స్వల్ప పెంపు
  • ఓలా, ఊబర్ ఆటోలపై 5 శాతం జీఎస్టీ
  • పాదరక్షలపై 12 శాతం పన్ను
కొత్త ఆంగ్ల సంవత్సరం 2022లో కొన్నింటి ధరలు ప్రియంగా మారాయి. మునుపటితో పోలిస్తే వీటి కోసం ప్రజలు కొంచెం అదనంగా ఖర్చు చేయాల్సి వస్తుంది. ఈ క్రమంలో ఏటీఎం లావాదేవీల చార్జీలు స్వల్పంగా పెరిగాయి. కనుక ప్రతీ నెలా ఏటీఎం లావాదేవీలను సొంత బ్యాంకు ఏటీఎం అయితే ఐదింటికి మించకుండా చూసుకుంటే చార్జీల భారాన్ని తప్పించుకోవచ్చు. బ్యాలన్స్ చెక్ చేసుకున్నా, నగదు తీసుకున్నా (బ్యాంకింగ్, నాన్ బ్యాంకింగ్) లావాదేవీ కిందకే వస్తుంది.

అలాగే, ప్రతి నెలా ఇతర బ్యాంకుల ఏటీఎంల్లో మూడు ఉచిత లావాదేవీల సదుపాయం కూడా కొనసాగుతుంది. ఉచిత లావాదేవీల పరిమితి తర్వాత ప్రతి లావాదేవీపై రూ.20 ఉన్న చార్జీ రూ.21కు పెరిగింది. ఈ చార్జీపై జీఎస్టీ అదనం.

ఓలా, ఊబర్ లో ఆటో బుక్ చేసుకుంటున్నారా..? అయితే ప్రతీ రూ.100కు రూ.5 జీఎస్టీ అమల్లోకి వచ్చింది. ఇప్పటి వరకు ట్యాక్సీ అగ్రిగేటర్ల ద్వారా ఆటో బుకింగ్ సేవలపై ఎటువంటి పన్నుల్లేవు. వీరి ద్వారా కాకుండా బయట ఆటో కిరాయికి తీసుకుంటే పన్ను ఉండదు.

కాలికి ధరించే పాదరక్షలపై పన్ను భారం 12 శాతానికి పెరిగింది. రూ.1,000లోపు పాదరక్షలపై గతంలో పన్నులేదు. రూ.1,000కుపైన 5 శాతం పన్ను రేటు ఉండేది. ఇప్పుడు అన్ని రకాల పాదరక్షలపై 12 శాతం పన్ను భారం అమల్లోకి వచ్చింది. ఇకపై రూ.1,000లోపు ఉత్పత్తులను కొనుగోలు చేసుకునే వారు సైతం అదనంగా వెచ్చించుకోవాలి.


More Telugu News