కొవాగ్జిన్ ఒక డోసు.. కోవిషీల్డ్ ఒక డోసు తీసుకుంటే అధిక రక్షణ: ఏఐజీ ఆసుపత్రి అధ్యయనంలో వెల్లడి

  • నాలుగు రెట్లు అధికంగా స్పైక్ ప్రొటీన్ యాంటీబాడీలు
  • కరోనా వైరస్ అంతం చూసేవి ఇవే
  • ఏఐజీ వైద్యుల పరిశోధనలో సత్ఫలితాలు
కొవాగ్జిన్, కోవిషీల్డ్ రెండూ వేర్వేరు వ్యాక్సిన్లు. ఒక్కరికే ఈ రెండు రకాల టీకాలను వేర్వేరు డోసులుగా ఇస్తే ఫలితాలు ఎలా ఉంటాయోనని.. హైదరాబాద్ లోని ఏఐజీ ఆసుపత్రి వైద్యులు నిర్వహించిన అధ్యయనంలో సానుకూల ఫలితాలు వెల్లడయ్యాయి. ఒకే రకం టీకాలను రెండు డోసులుగా తీసుకున్న వారితో పోలిస్తే.. ఒక డోసు కొవాగ్జిన్, ఇంకొక డోసు కోవిషీల్డ్ తీసుకున్నవారిలో స్పైక్ ప్రోటీన్ యాంటీబాడీల స్పందన నాలుగు రెట్లు అధికంగా వృద్ధి చెందుతున్నట్టు గుర్తించారు.

మిశ్రమ డోసులపై ఫలితాలు ఎలా ఉంటాయో తెలుసుకునేందుకే ఈ అధ్యయనం చేపట్టారు. ఇందులో భాగంగా 330 మంది ఆరోగ్యవంతులైన వలంటీర్లను (టీకాలు తీసుకోనివారు, కరోనా ఇన్ఫెక్షన్ సోకని వారు) ఎంపిక చేసి వారిపై ఈ ప్రయోగాలు చేశారు. ఇందులో 44 మందిలో కోవిడ్ యాంటీబాడీలు (సెరో నెగెటివ్) లేవని పరీక్ష ద్వారా నిర్ధారించుకున్నారు.

ఈ 44 మందిని నాలుగు గ్రూపులుగా విభజించారు. రెండు గ్రూపులకు ఒకటే టీకా రెండు డోసులుగా ఇచ్చారు. మూడో గ్రూపునకు ఒక డోసు కోవిషీల్డ్, రెండో డోసు కొవాగ్జిన్ ఇచ్చారు. నాలుగో గ్రూపునకు మొదటి డోసుగా కొవాగ్జిన్, రెండో డోసుగా కోవిషీల్డ్ ఇచ్చి చూశారు.

మొదటి రెండు గ్రూపుల్లోని వారితో (ఒక తరహా టీకా రెండు డోసులు) పోలిస్తే.. తర్వాతి రెండు గ్రూపుల్లోని వారికి స్పైక్ ప్రొటీన్ న్యూట్రలైజింగ్ యాంటీబాడీలు నాలుగు రెట్లు అధికంగా ఏర్పడినట్టు వైద్యులు తెలుసుకున్నారు. వీరిని రెండు డోసుల తర్వాత కూడా 60 రోజుల పాటు ఏమైనా దుష్ప్రభావాలు వస్తాయేమోనని పరిశీలనలో ఉంచి చూశారు. అయితే, ఎటువంటి తీవ్ర దుష్ప్రభావాలు తలెత్తలేదు.

‘‘స్పైక్ ప్రొటీన్ న్యూట్రలైజింగ్ యాంటీబాడీలు వైరస్ ను చంపేసి, ఇన్ఫెక్షన్ తీవ్రతను తగ్గిస్తాయి’’ అని ఏఐజీ ఆసుపత్రి చైర్మన్ డాక్టర్ డి.నాగేశ్వర్ రెడ్డి మీడియాకు తెలిపారు. రెండు వేర్వేరు డోసుల మిశ్రమం సత్ఫలితాలను ఇస్తున్నట్టు ఈ అధ్యయనం తేల్చింది.


More Telugu News