పీఆర్సీ నివేదికను యథాతథంగా ఆమోదించాలని సీఎంను కోరాం: ఏపీ జేఏసీ అమరావతి అధ్యక్షుడు బొప్పరాజు

  • సీఎం జగన్ తో ఉద్యోగ సంఘాల చర్చలు
  • సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన బొప్పరాజు
  • అధికారుల కమిటీ నివేదికకు, అశుతోష్ మిశ్రా నివేదికకు 4 అంశాల్లో తేడాలున్నాయి 
  • అధికారుల కమిటీ నివేదికతో ఫిట్ మెంట్ విషయంలో నష్టపోతామన్న బొప్పరాజు   
సీఎం జగన్ తో ఉద్యోగ సంఘాల సమావేశం ముగిసింది. అనంతరం ఏపీ జేఏసీ అమరావతి అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు మీడియాతో మాట్లాడారు. పీఆర్సీ, ఇతర సమస్యలపై సీఎం జగన్ తో చర్చలు జరిపామనిచెప్పారు. 11వ పీఆర్సీపై రెండున్నరేళ్లు 200 సంఘాలతో చర్చలు జరిపామని, పీఆర్సీ నివేదికలో శాస్త్రీయ అంశాలు పొందుపరిచారని తెలిపారు. కానీ అధికారుల కమిటీ నివేదికను వారంలో తయారుచేశారని ఆవేదన వెలిబుచ్చారు.

అధికారుల కమిటీ నివేదికకు, అశుతోష్ మిశ్రా నివేదికకు 4 అంశాల్లో తేడాలున్నాయని అన్నారు. ఫిట్ మెంట్, పెన్షనర్లు, హెచ్ఆర్ఏ, సీసీఏ అంశాల్లో తేడాలను గుర్తించామని చెప్పారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు తీవ్ర ఆందోళనలో ఉన్నారని బొప్పరాజు వెల్లడించారు. అధికారుల కమిటీ నివేదికతో ఫిట్ మెంట్ విషయంలో నష్టపోతామని ఆందోళన వ్యక్తం చేశారు. అందుకే పీఆర్సీ నివేదికను యథాతథంగా ఆమోదించాలని సీఎంను కోరామని బొప్పరాజు వెల్లడించారు. ఐఆర్ కు తగ్గకుండా ఫిట్ మెంట్ ఖరారు చేయాలని కోరామని తెలిపారు.

అటు, హెచ్ఆర్ఏకు సంబంధించి అసంబద్ధంగా ప్రతిపాదించారని, పీఆర్సీ కమిషన్ సిఫారసు మేరకు హెచ్ఆర్ఏ ఉండాలని స్పష్టం చేశారు.


More Telugu News