ముంబైలోని ఆసుపత్రులలో 96 శాతం మంది రోగులు ఒక్క టీకా కూడా తీసుకోని వారే!

  • రెండు డోసులతో ఐసీయూ అవసరం రావడం లేదు
  • ఒమిక్రాన్ ను ఫ్లూగా తేలిగ్గా తీసుకోవద్దు
  • ముంబై నగర పాలక కమిషనర్ చాహల్ వెల్లడి  
కరోనా టీకాలతో ఎంతో కొంత రక్షణ ఉంటుందని ఇప్పటి వరకు చాలా అధ్యయనాలు, ప్రత్యక్ష నిదర్శనాలు నిరూపించాయి. తాజాగా ముంబైలోని ఆసుపత్రులలో ఆక్సిజన్ సపోర్ట్ పై ఉన్న 1900 మంది బాధితుల్లోనూ 96 శాతం మంది ఒక్క టీకా కూడా తీసుకోని వారేనని ముంబై మన్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ ఇక్బాల్ చాహల్ స్వయంగా ప్రకటించారు.

‘‘ముంబైలోని 186 ఆసుపత్రులలో ఆక్సిజన్ పడకలపై ఉన్న బాధితుల్లో 96 శాతం మంది అస్సలు టీకాలు తీసుకోలేదు. ఇప్పటి వరకు మేము చూసిన ప్రత్యక్ష పరిస్థితులను గమనిస్తే.. టీకాలు తీసుకున్న వారు ఐసీయూల వరకు రావడం లేదు. ఒమిక్రాన్ రకాన్ని ఒక ఫ్లూగా భావించొద్దు. టీకాలు తీసుకోకపోతే ఒమిక్రాన్ ఇన్ఫెక్షన్ తో ఐపీయూలో చేరాల్సి రావచ్చు’’ అని చాహల్ వివరించారు.

ముంబైలో కోటి మందికి పైగా ప్రజలకు రెండు డోసులు ఇవ్వగా, 90 లక్షల మందికి ఒక్కడోసే పూర్తయినట్టు చాహల్ చెప్పారు. రెండు డోసులు ఇవ్వడానికి మధ్యలో 84 రోజుల వ్యవధి అవసరమన్నారు. మరోవైపు మొదటి రెండు విడతల్లో కేసుల పాజిటివ్ రేటు ఆధారంగా ఆంక్షలు విధించగా.. ఈ విడత ఆసుపత్రులలో పడకలు నిండడం, ఆక్సిజన్ డిమాండ్ ఆధారంగానే ముంబైలో ఆంక్షలు అమలు చేయాలని అక్కడి నగరపాలక మండలి నిర్ణయించింది.


More Telugu News