కోహ్లీ సంచలన నిర్ణయం... టీమిండియా టెస్టు కెప్టెన్సీకి రాజీనామా

  • దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్ ఓటమి
  • కెప్టెన్ గా తన ప్రస్థానం ముగిసిందన్న కోహ్లీ
  • బీసీసీఐకి, ఆటగాళ్లకు కృతజ్ఞతలు
  • ఓ ప్రకటనలో వీడ్కోలు సందేశం
ఇటీవలే టీమిండియా టీ20 కెప్టెన్సీ వదులుకున్న విరాట్ కోహ్లీ తాజాగా టెస్టు కెప్టెన్సీకి రాజీనామా చేశాడు. ఇకపై తాను ఐదు రోజుల ఫార్మాట్లో కెప్టెన్ గా కొనసాగబోవడంలేదని ఓ ప్రకటనలో వెల్లడించాడు.

"జట్టును సరైన దిశగా నడిపించడం కోసం ఏడేళ్లుగా కఠోరంగా శ్రమించాను. కెప్టెన్ గా జట్టుకోసం సర్వశక్తులు ధారపోశాను. ఎంతో నిజాయతీగా వ్యవహరించాను. ప్రతి దానికి ఏదో ఒక దశలో ముగింపు అనేది ఉంటుంది. నా విషయంలోనూ అంతే... టీమిండియా టెస్టు కెప్టెన్ గా నా ప్రస్థానం ఇంతటితో ముగిసిందని అనుకుంటున్నాను.

ఈ నా ప్రస్థానంలో ఒక్కసారి కూడా ప్రయత్నలోపం కానీ, నమ్మకం కోల్పోవడం కానీ జరగలేదు. జట్టు కోసం ప్రతి సందర్భంలో 120 శాతం కష్టపడ్డాను. నేను ఏదైనా చేయలేకపోయుంటే, అది చేయదగ్గ పని కాదనే అర్థం. టెస్టు కెప్టెన్ గా నేను వ్యవహరించిన విధానంపై నాకు ఎంతో స్పష్టత ఉంది. ఎంతో సుదీర్ఘ కాలం ఈ ఫార్మాట్లో కెప్టెన్ గా కొనసాగేందుకు అవకాశమిచ్చిన బీసీసీఐకి, నాకు సహకరించిన సహచర ఆటగాళ్లకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అనేక విజయాలు సాధించడంలో సహకరించి నా ప్రస్థానాన్ని చిరస్మరణీయం చేశారు.

టెస్టు క్రికెట్లో టీమిండియా నిలకడగా ఆడుతూ, విజయాలు సాధించడానికి కారణం రవిశాస్త్రి, సహాయక బృందం. ఈ ఘనతల వెనుక ఉన్న ఛోదకశక్తి వాళ్లే. చివరగా, ఎంఎస్ ధోనీకి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. కెప్టెన్ గా భారత క్రికెట్ ను ముందుకు తీసుకెళ్లగలడు అని ధోనీ నాపై నమ్మకం ఉంచాడు" అని కోహ్లీ తన ప్రకటనలో వివరించాడు.

దక్షిణాఫ్రికాతో తాజాగా ముగిసిన మూడు టెస్టుల సిరీసే కెప్టెన్ గా కోహ్లీకి చివరి సిరీస్ అని చెప్పాలి. ఈ సిరీస్ ను టీమిండియా 1-2తో చేజార్చుకుంది. ఈ క్రమంలో కోహ్లీ టెస్టు కెప్టెన్సీ నుంచి తప్పుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది.

ఇటీవల టీ20 వరల్డ్ కప్ ముగిసిన తర్వాత కోహ్లీ పొట్టి ఫార్మాట్లో కెప్టెన్సీకి వీడ్కోలు పలకడం తెలిసిందే. అయితే సెలెక్టర్లు అనూహ్యరీతిలో వన్డే కెప్టెన్సీ నుంచి కూడా కోహ్లీని తప్పించారు. కోహ్లీ స్థానంలో రోహిత్ శర్మను పరిమిత ఓవర్ల ఫార్మాట్లలో టీమిండియా సారథిగా నియమించారు. ఇప్పుడు, టెస్టు కెప్టెన్ గానూ కోహ్లీ వైదొలగిన నేపథ్యంలో తదుపరి కెప్టెన్ ఎవరన్నది ఆసక్తి కలిగిస్తోంది.

2015లో ధోనీ నుంచి టెస్టు సారథ్య బాధ్యతలు అందుకున్న కోహ్లీ.. విదేశాల్లోనూ భారత్ ను బలమైన జట్టుగా తీర్చిదిద్దాడు. ఐసీసీ ర్యాంకింగ్స్ లో టీమిండియా నెం.1 స్థానానికి ఎగబాకడమే కాదు, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా వంటి దేశాల్లో చిరస్మరణీయ విజయాలు సొంతం చేసుకుంది. కోహ్లీ సారథ్యంలో టీమిండియా 68 టెస్టుల్లో 40 విజయాలు సాధించింది. టెస్టు క్రికెట్ చరిత్రలో విజయవంతమైన సారథుల్లో కోహ్లీ నాలుగో స్థానంలో ఉన్నాడు.


More Telugu News