కరోనా వేళ ఇదేం నిర్ణయం?: ఏపీ సర్కారుపై పవన్ కల్యాణ్ విమర్శలు

  • తెలుగు రాష్ట్రాల్లో కరోనా ఆందోళనకరంగా ఉందన్న పవన్
  • అన్ని వర్గాల వారు కరోనాబారినపడుతున్నారని వ్యాఖ్య  
  • చంద్రబాబు త్వరగా కోలుకోవాలని ఆకాంక్ష
ఏపీలో రాత్రివేళ కర్ఫ్యూ, ఇతరత్రా ఆంక్షలు ఉన్నప్పటికీ పాఠశాలల్లో తరగతుల కొనసాగింపు ప్రస్తుత తరుణంలో ఆమోదయోగ్యం కాదని జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. కొవిడ్ తీవ్రత తగ్గేంత వరకు తరగతులను వాయిదా వేయాలని విజ్ఞప్తి చేశారు. పిల్లలకు వ్యాక్సినేషన్ ఇంకా పూర్తి కాలేదని, వారిలో ఇమ్యూనిటీ తక్కువగా ఉండడం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని నిర్ణయం తీసుకోవాల్సిందిగా కోరుతున్నట్టు తెలిపారు.

ప్రస్తుత కష్ట సమయంలో మద్యం దుకాణాలను మరో గంట పాటు అదనంగా తెరిచి ఉంచాలని ఆదేశాలు జారీ చేయడం ప్రభుత్వ అనాలోచిత వైఖరిని వెల్లడిస్తోందని పవన్ కల్యాణ్ విమర్శించారు. కరోనా వ్యాప్తి అధికమవుతున్న వేళ ప్రజలకు నిత్యావసర వస్తువులు ఎలా ఇవ్వాలి? మరింత మెరుగైన వైద్యసేవలు అందించేందుకు ఎలాంటి కార్యాచరణ రూపొందించాలి? అని కాకుండా, మద్యం అమ్మకాలపై దృష్టి పెట్టడం ఏంటని ప్రశ్నించారు.

దేశంలోనూ, తెలుగు రాష్ట్రాల్లోనూ కరోనా గణాంకాలు ఆందోళన కలిగిస్తున్నాయని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. ప్రజలకు ప్రత్యక్ష సేవలు అందించే డాక్టర్లు, వైద్య సహాయక సిబ్బంది, మెడికోలు, పోలీసులు, స్థానిక సంస్థల సిబ్బంది, మీడియా ఉద్యోగులు అధిక సంఖ్యలో కరోనా బారినపడుతున్నట్టు వస్తున్న వార్తలు విచారం కలిగిస్తున్నాయని తెలిపారు.

ప్రజాప్రతినిధులు, రాజకీయనేతలు కూడా కరోనా బారినపడుతుండడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోందని వివరించారు. టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబునాయుడు కూడా కరోనాతో అస్వస్థతకు గురికావడం విచారకరమని, ఆయన త్వరగా కోలుకుని ఎప్పట్లాగే ప్రజల కోసం పనిచేయాలని పవన్ కల్యాణ్ ఆకాంక్షించారు. ఇలాంటి పరిస్థితుల్లో తెలుగు రాష్ట్రాల్లోని ప్రభుత్వాలు మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

మరిన్ని కొవిడ్ కేంద్రాలు ఏర్పాటు చేసి, పరీక్షలు పెంచడం ద్వారా రోగులను గుర్తించి వైద్యం చేసే అవకాశం కలుగుతుందని అభిప్రాయపడ్డారు. మొబైల్ పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేస్తే ప్రయోజనకరంగా ఉంటుందని పేర్కొన్నారు. కరోనా ఫస్ట్ వేవ్ సమయంలో అమలు చేసిన ట్రాక్ అండ్ ట్రేస్ విధానాన్ని మళ్లీ తీసుకురావాలని పవన్ కల్యాణ్ సూచించారు.


More Telugu News