ప్రగతి భవన్ వద్ద జేసీ దివాకర్ రెడ్డికి అవమానం

  • కేసీఆర్ ను కలిసేందుకు ప్రగతి భవన్ కు వెళ్లిన జేసీ దివాకర్ రెడ్డి
  • అపాయింట్ మెంట్ లేకుండా లోపలకు పంపించలేమన్న అధికారులు
  • కనీసం కేటీఆర్ ను కలుస్తానని అడిగిన జేసీ
ఉమ్మడి ఏపీ మాజీ మంత్రి, ఏపీ రాజకీయాల్లో కీలక నేత జేసీ దివాకర్ రెడ్డికి పరాభవం ఎదురైంది. ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలవడానికి హైదరాబాదులోని ప్రగతి భవన్ కు వచ్చిన జేసీకి అవమానం జరిగింది. అపాయింట్ మెంట్ లేకుండా లోపలకు పంపించలేమంటూ అక్కడున్న సెక్యూరిటీ అధికారులు ఆయనను నిలువరించారు.

దీంతో సీఎంను కాకపోయినా... కనీసం మంత్రి కేటీఆర్ ను కలుస్తానని ఆయన అడిగారు. దానికి కూడా అధికారులు ససేమిరా అన్నారు. అనుమతి ఉంటేనే లోపలకు పంపిస్తామని స్పష్టం చేశారు. దీంతో చేసేదేమీ లేక ఆయన అక్కడి నుంచి వెనుదిరిగారు.

ఒకానొక సమయంలో సెక్యూరిటీ అధికారులతో జేసీ వాగ్వాదానికి దిగారు. తనకు అపాయింట్ మెంట్ ఇచ్చేదేమిటని ఆయన ప్రశ్నించారు. తాను లోపలకు వెళతానని వాగ్వాదానికి దిగారు. అయినప్పటికీ ముందస్తు అపాయింట్ మెంట్ లేకుండా లోపలకు పంపలేమని అధికారులు ఆయనకు స్పష్టం చేశారు. దీంతో ఆయన వెనుదిరిగారు.


More Telugu News