తెలంగాణ‌లో నైట్ క‌ర్ఫ్యూ అంశంపై హైకోర్టుకు ప్ర‌భుత్వం వివ‌ర‌ణ‌

  • రాత్రి కర్ఫ్యూ విధించేంత‌ తీవ్రత లేదు
  • పాజిటివిటీ 10 శాతం దాటితేనే రాత్రి కర్ఫ్యూ
  •  ప్రస్తుతం పాజిటివిటీ రేటు 3.16 శాతం
  • జన స‌మూహాలు లేకుండా ప్ర‌భుత్వం ఈనెల 31 వరకు ఆంక్షలు
తెలంగాణ‌లో క‌రోనా కేసులు, వైర‌స్ క‌ట్ట‌డిపై హైకోర్టులో ఈ రోజు విచార‌ణ జ‌రిగింది. కరోనా పరిస్థితి, ప్రభుత్వం తీసుకుంటోన్న‌ చర్యలపై హైకోర్టుకు రాష్ట్ర ప్రజారోగ్య శాఖ నివేదిక స‌మ‌ర్పించింది. అయితే, ప్రభుత్వం తప్పుడు గణాంకాలు ఇస్తోందని పిటిషనర్లు వాదించారు. కేవ‌లం మూడు రోజుల్లోనే 1.70 లక్షల జ్వర బాధితులను గుర్తించార‌ని పిటిషనర్‌ తరఫు న్యాయవాది అన్నారు. తెలంగాణ‌లో కరోనా తీవ్రతకు ఇదే నిదర్శనమని తెలిపారు. ప్రభుత్వం అందిస్తోన్న‌ కిట్‌ల‌లో పిల్లలకు అవసరమైన మందులు లేవని అన్నారు.

అయితే, మరోపక్క ప్రజారోగ్య సంచాలకుడు శ్రీనివాసరావు హైకోర్టుకు ప‌లు వివ‌రాలు తెలిపారు. తెలంగాణలో రాత్రి కర్ఫ్యూ విధించేంత‌ తీవ్రత లేదని చెప్పారు. పాజిటివిటీ 10 శాతం దాటితేనే రాత్రి కర్ఫ్యూ అవసరమని తెలిపారు. ప్రస్తుతం పాజిటివిటీ రేటు 3.16 శాతం ఉందని, తెలంగాణ‌లోని ఒక్క జిల్లాలోనూ 10 శాతం మించలేదని వివరించారు.

అలాగే, ఐసీయూ, ఆక్సిజన్ పడకల ఆక్యుపెన్సీ 6.1 శాతంగా ఉంద‌ని, క‌రోనా బాధితుల‌కు చికిత్స అందించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామ‌న్నారు. ముందు జాగ్రత్తగా జన స‌మూహాలు లేకుండా ప్ర‌భుత్వం ఈనెల 31 వరకు ఆంక్షలు విధించినట్టు గుర్తు చేశారు. వారం రోజులుగా తెలంగాణ‌లో రోజుకు లక్ష చొప్పున‌ కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నామని అన్నారు.

ఇంటింటి జ్వరం సర్వే జరుగుతోందని తెలిపారు. మూడురోజుల్లో లక్షణాలున్న లక్షా 78 వేలమందికి కిట్లు పంపిణీ చేశామని తెలిపారు. తెలంగాణ‌లో కరోనా వ్యాక్సినేషన్‌ ప్రక్రియ వేగవంతం చేశామని, 18 ఏళ్లలోపు పిల్ల‌ల్లో 59 శాతం మందికి టీకాలు ఇచ్చామని డీహెచ్ వివరించారు. అంతేగాక‌, తెలంగాణ‌లో 2.16 లక్షల మందికి ప్రికాషనరీ డోసు ఇచ్చినట్టు చెప్పారు.

అయితే, భౌతికదూరం అమలు కాకపోవడం దురదృష్టకరమ‌ని హైకోర్టు వ్యాఖ్యానించింది. కొవిడ్ నిబంధనలను కఠినంగా అమలు చేయాలని హైకోర్టు పేర్కొంది. ఈ ఆదేశాల‌ను జీహెచ్‌ఎంసీ, పోలీసులు కఠినంగా అమలు చేయాలని చెప్పింది. విచారణను ఈ నెల 28కి వాయిదా వేస్తున్న‌ట్లు హైకోర్టు తెలిపింది.


More Telugu News