గర్ల్ ఫ్రెండ్ బెయిల్ కోసం దారుణ హత్యలు.. ఓక్లహామలో హంతకుడికి మరణశిక్ష అమలు

  • అమెరికాలో 2022లో తొలి మరణశిక్ష అమలు 
  • డొనాల్డ్ ఆంథోనీ గ్రాంట్ కు ప్రాణాంతక ఇంజెక్షన్
  • 2001లో హోటల్ దోపీడీ.. ఇద్దరి హత్య
అమెరికాలో 2022లో తొలి మరణశిక్ష అమలైంది. ఓక్లహామ రాష్ట్రంలో డొనాల్డ్ ఆంథోనీ గ్రాంట్ (46) కు ప్రాణాంతక ఇంజెక్షన్ ఇవ్వడం ద్వారా గురువారం మరణశిక్ష అమలు చేశారు. ప్రియురాలి కోసం అతడు చేసిన హత్యలకు ప్రతిఫలాన్ని అనుభవించాడు.

2001లో 25 ఏళ్ల వయసున్నప్పుడు గ్రాంట్ ఒక హోటల్ లో దోపిడీకి యత్నించాడు. డెల్ సిటీ మోటెల్ వద్ద ఉద్యోగం కోసం అతడు దరఖాస్తు చేసుకున్నాడు. మరుసటి రోజు అదే హోటల్ కు వెళ్లి దోపిడీకి పాల్పడ్డాడు. ఈ సందర్భంగా హోటల్ మేనేజర్, డెస్క్ క్లర్క్ పై కాల్పులు జరపడంతో వారు ప్రాణాలు కోల్పోయారు. తన గర్ల్ ఫ్రెండ్ కు బెయిల్ ఇప్పించేందుకు డబ్బు అవసరం పడింది. దానికి దోపిడీని మార్గంగా ఎంచుకున్నాడు.

దీంతో 2005లో స్థానిక కోర్టు అతడికి మరణశిక్షను ఖరారు చేసింది. అప్పటి నుంచి ఎన్నో అప్పీళ్లతో కాలహరణ జరిగిపోయింది. చిన్నతనంలో తండ్రి హింసాత్మక ప్రవర్తనకు గ్రాంట్ బాధితుడని, అతడు ఫీటల్ ఆల్కహాల్ సిండ్రోమ్ (గర్భవతిగా వున్న తల్లి మద్యం తాగడం వల్ల శిశువుకు కలిగే దుష్ప్రభావం)తో పాటు, తాగొచ్చిన తండ్రి చిన్నతనంలో తనను కొట్టడం వల్ల కలిగిన మెదడు గాయం కారణంగా ఏర్పడిన వ్యాధితో బాధపడుతున్నాడని వాదిస్తూ అతడి తరఫున న్యాయవాదులు మరణశిక్షను తప్పించే ప్రయత్నం చేశారు.

అయినా వారి ప్రయత్నాలు ఫలించలేదు. గురువారం మెక్ అలెస్టర్ పట్టణంలోని కారాగారం వద్ద ప్రాణాంతక సూది మందు ఇచ్చి గ్రాంట్ కు మరణశిక్ష అమలు చేశారు. అమెరికాలో 23 రాష్ట్రాలు మరణశిక్షను రద్దు చేశాయి. మరో మూడు రాష్ట్రాలు స్వచ్ఛంద మారటోరియం విధించుకున్నాయి. మిగిలిన రాష్ట్రాల్లో ఇది కొనసాగుతోంది.


More Telugu News