ప్ర‌స్తుత క‌రోనా థ‌ర్డ్ వేవ్‌పై ప్ర‌ధాని మోదీ స్పంద‌న‌

  • మ‌న్ కీ బాత్‌లో మాట్లాడిన మోదీ
  • ప్ర‌స్తుతం క‌రోనా వేవ్‌పై భార‌త్ స‌మ‌ర్థంగా పోరాడుతోంది
  • దాదాపు 4.5 కోట్ల మంది పిల్ల‌లకు వ్యాక్సిన్లు
  • దేశాన్ని అవినీతిర‌హితంగా మార్చాల‌న్న మోదీ
దేశంలో ప్ర‌స్తుతం కొన‌సాగుతోన్న‌ క‌రోనా థ‌ర్డ్ వేవ్‌పై ప్ర‌ధాని మోదీ స్పందించారు. ఈ రోజు ఆయ‌న మ‌న్ కీ బాత్ రేడియో కార్య‌క్ర‌మంలో మాట్లాడుతూ... ''ప్ర‌స్తుతం క‌రోనా వేవ్‌పై భార‌త్ స‌మ‌ర్థంగా పోరాడుతోంది. ఇప్ప‌టివ‌ర‌కు దాదాపు 4.5 కోట్ల మంది పిల్ల‌లకు క‌రోనా వ్యాక్సిన్లు వేయ‌డం గర్వించ‌ద‌గ్గ విష‌యం'' అని ప్ర‌ధాని మోదీ అన్నారు.
 
2047 నాటికి రైతులు సంపన్నులు కావాలని, దేశం అవినీతి రహితంగా మారాలన్నదే తన కల అని ఉత్తర ప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ నుండి నవ్యా వర్మ అనే వ్య‌క్తి ఓ పోస్ట్ కార్డ్ లో రాశార‌ని మోదీ గుర్తు చేసుకున్నారు. అవినీతిరహిత భారతదేశం గురించి ఆయ‌న‌ రాశారని, అవినీతి చెదపురుగులా దేశాన్ని డొల్లగా మార్చేస్తుందని మోదీ అన్నారు.

భార‌త్‌ను అవినీతిరహితంగా మార్చడానికి 2047 వరకూ ఎందుకు ఎదురు చూడాలని మోదీ ప్ర‌శ్నించారు. ఆ పనిని మన దేశ ప్రజలందరూ కలిసి త్వరగా చేయాల‌ని పిలుపునిచ్చారు. మన కర్తవ్యాలను మనం సరిగ్గా నిర్వర్తించాల‌ని మోదీ చెప్పారు. అలాచేస్తే అవినీతి ఉండ‌బోద‌ని చెప్పారు.

విద్య, జ్ఞానాన్ని అందించిన తపోభూమి భారతదేశం అని ప్రధాని మోదీ చెప్పారు. విద్యను కేవలం పుస్తక జ్ఞానం వరకే పరిమితం చేయ‌లేద‌ని,  దాన్ని ఒక సమగ్ర జీవన అనుభవంలా చూశామని మోదీ తెలిపారు.  పండిత్ మదన్ మోహన్ మాలవీయా బనారస్ హిందూ విశ్వవిద్యాలయాన్ని స్థాపించారని, గాంధీజీ గుజరాత్ విద్యాపీఠ్ నిర్మాణంలో ప్రముఖ పాత్ర పోషించార‌ని ఆయ‌న చెప్పారు.

ఈ సంద‌ర్భంగా గుజ‌రాత్‌లో విద్యాల‌యాల గురించి మోదీ ప్ర‌స్తావించారు. ఆ రాష్ట్రంలోని ఆనంద్ లో వల్లభ్ విద్యానగర్ అనే ప్రాంతం ఉందని, సర్దార్ వల్లభాయ్ పటేల్ కోరిక మేరకు భాయీ కాకా, భీఖా భాయీ అనే వారి సహచరులు అక్కడ యువత కోసం విద్యాకేంద్రాలను స్థాపించారని మోదీ కొనియాడారు. మ‌రోవైపు, పశ్చిమ బెంగాల్ లో మహర్షి దేవేంద్రనాథ్ ఠాగూర్ శాంతినికేతన్ ని స్థాపించారని ప్రధాని మోదీ అన్నారు. అలాగే, మహారాజు గైక్వాడ్ విద్యను ప్రోత్సహించార‌ని ఆయ‌న చెప్పారు.


More Telugu News