జగన్ 30 ఏళ్లు అధికారంలో ఉంటారు.. చేసిన అప్పులు ఎలా తీర్చాలో ఆయనకు తెలుసు: మంత్రి ముత్తంశెట్టి

  • చాలా రాష్ట్రాలు అప్పులు చేశాయి
  • పర్యాటక రంగాన్ని విస్తరించడం ద్వారా ఏటా రూ. 200 కోట్ల ఆదాయం
  • రాష్ట్రంలో 8 క్రీడా పాఠశాలలు ప్రారంభిస్తాం
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి 30 సంవత్సరాలపాటు అధికారంలో ఉంటారని, చేసిన అప్పులు ఎలా తీర్చాలో ఆయనకు తెలుసని ఏపీ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు తెలిపారు. సచివాలయంలో నిన్న పర్యాటక, క్రీడ, సాంస్కృతిక శాఖలపై సమీక్ష నిర్వహించిన అనంతరం మంత్రి విలేకరులతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.

ఆంధ్రప్రదేశ్ ఒక్కటే అప్పులు చేయలేదని, కరోనా సమయంలో దేశంలోని అన్ని రాష్ట్రాలు అప్పులు చేశాయని పేర్కొన్నారు. ఇంకా చెప్పాలంటే, చాలా రాష్ట్రాలు ఏపీ కంటే ఎక్కువగానే అప్పులు చేశాయన్నారు. చేసిన అప్పులు ఎలా తీర్చాలో కూడా జగన్‌కు తెలుసన్నారు.

ఇకపోతే, పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయడం, విస్తరించడం ద్వారా ఏటా రూ. 200 కోట్ల ఆదాయం సమకూరేలా ప్రణాళికలు రచిస్తున్నట్టు చెప్పారు. ఈ నెల చివరి వారంలో కానీ, లేదంటే వచ్చే నెల మొదటి వారంలో కానీ పెట్టుబడిదారుల సమావేశం నిర్వహిస్తామని మంత్రి పేర్కొన్నారు.

పర్యాటక స్థలాలు, ఆస్తులను లీజుకు తీసుకున్న వారి నుంచి రూ. 31.08 కోట్ల బకాయిలు రావాల్సి ఉందని, వాటిని త్వరలోనే వసూలు చేస్తామన్నారు. పర్యాటక సంస్థకు చెందిన 18 రెస్టారెంట్ల నిర్వహణకు 50 టెండర్లు వచ్చాయని, పరిశీలన అనంతరం వాటిని ఖరారు చేస్తామని చెప్పారు. అలాగే, రాష్ట్రంలో కొత్తగా 8 క్రీడా పాఠశాలలను ప్రారంభిస్తామని చెప్పారు.


More Telugu News