క్రికెట్ అభిమానులకు శుభవార్త.. భారత్-విండీస్ టీ20 సిరీస్‌కు ప్రేక్షకులకు అనుమతి

  • 75 శాతం సామర్థ్యంతో ప్రేక్షకులకు అనుమతినిచ్చిన పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం
  • 50 వేల మంది ప్రేక్షకులతో కళకళలాడనున్న స్టేడియాలు
  • టీ20 సిరీస్‌కు ఈడెన్ గార్డెన్స్ ఆతిథ్యం
క్రికెట్ ప్రేమికులు స్టేడియాల్లో మ్యాచ్‌లు చూసి ఎన్నాళ్లయిందో! కరోనా ఈ ప్రపంచంపై దండెత్తడానికి ముందు ప్రేక్షకులతో స్టేడియాలు కిటకిటలాడేవి. కరోనా దాడి తర్వాత స్టేడియాలన్నీ బోసిపోయి దర్శనమిస్తున్నాయి. అభిమానుల కేరింతలు లేకుండా మ్యాచ్‌లు నిశ్శబ్దంగా, చప్పగా సాగుతున్నాయి. అయితే, ఈ నెలలో వెస్టిండీస్‌తో జరగనున్న టీ20 సిరీస్‌తో అభిమానులకు ఆ కొరత తీరనుంది.

విండీస్‌తో జరగనున్న మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు ఈడెన్ గార్డెన్స్ ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ నేపథ్యంలో స్టేడియం సామర్థ్యంలో 75 శాతం ప్రేక్షకులను అనుమతించాలని ఈడెన్ గార్డెన్స్ అధికారులు నిర్ణయించారు. ఇండోర్, అవుట్‌డోర్ క్రీడలను 75 శాతం సామర్థ్యంతో నిర్వహించుకోవచ్చని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం నిన్న ప్రకటించిన నేపథ్యంలో ఈడెన్ గార్డెన్స్ అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు.

తాజా నిర్ణయంతో టీ20 మ్యాచ్‌లకు దాదాపు 50 వేల మంది ప్రేక్షకులను అనుమతిస్తారు. వెస్టిండీస్‌తో మూడు వన్డేలు, మూడు టీ20 మ్యాచ్‌లు జరగనున్నాయి. ఈ నెల 6 నుంచి ప్రారంభం కానున్న వన్డే  సిరీస్‌కు అహ్మదాబాద్ ఆతిథ్యం ఇవ్వనుంది. టీ20 సిరీస్ 16 నుంచి ప్రారంభం అవుతుంది. కీరన్ పొలార్డ్ సారథ్యంలోని కరీబియన్ జట్టును ఎదుర్కొనేందుకు సిద్ధమైన రోహిత్‌శర్మ సేన ఇప్పటికే అహ్మదాబాద్ చేరుకుని బయోబబుల్‌లోకి ప్రవేశించింది.


More Telugu News