ఒమిక్రాన్ ఉపరకం బీఏ.2 తీవ్రతపై డబ్ల్యూహెచ్ వో ఆసక్తికర ప్రకటన

  • ఒమిక్రాన్ కన్నా తీవ్రమేమీ కాదని వెల్లడి
  • కేసులు భారీగా పెరుగుతున్నాయన్న టెక్నికల్ లీడ్
  • ఆంక్షలు ఎత్తివేయడం పట్ల డబ్ల్యూహెచ్ వో చీఫ్ ఆందోళన
  • ఇంకా చాలా దేశాల్లో ఒమిక్రాన్ పీక్ కు చేరుకోలేదని వెల్లడి
కరోనా వేరియంట్ ఒమిక్రాన్ ఉపరకం బీఏ.2పై ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ వో) ఆసక్తికర ప్రకటన చేసింది. అసలు వేరియంట్ కన్నా ఈ కొసరు వేరియంట్ అంత ప్రమాదకరమేమీ కాదని డబ్ల్యూహెచ్ వో టెక్నికల్ లీడ్ మరియా కెర్ఖోవే అన్నారు. దాని వల్ల తీవ్రత పెరుగుతోందనడానికి ఎలాంటి ఆధారాల్లేవని చెప్పారు. అయితే, ప్రస్తుతం అది కూడా చాలా వేగంగా విస్తరిస్తోందన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

బీఏ.2తో పాటు ఒమిక్రాన్ కూడా చాలా వేగంగా వ్యాప్తి చెందుతోందని అన్నారు. వేగంగా విస్తరించినా దాని తీవ్రత మాత్రం డెల్టాతో పోలిస్తే తక్కువేనని పేర్కొన్నారు. డెన్మార్క్ లో ప్రస్తుతం ఈ బీఏ.2 వేరియంట్ కేసులు ఎక్కువగా వస్తున్న నేపథ్యంలో ఆమె ఈ ప్రకటన చేశారు.

కాగా, చాలా దేశాలు ఆంక్షలు ఎత్తివేయడాన్ని డబ్ల్యూహెచ్ వో చీఫ్ టెడ్రోస్ అధనోం ఘెబ్రియేసస్ తప్పుబట్టారు. చాలా దేశాల్లో ఒమిక్రాన్ ఇంకా పీక్ దశకు చేరుకోలేదని, ఇలాంటి పరిస్థితుల్లో ఆంక్షలు ఎత్తివేయడం తొందరపాటే అవుతుందని అన్నారు. వైరస్ కు లొంగిపోయామని కానీ, లేదా విజయం సాధించామని కానీ ముందే ప్రకటించడం భావ్యం కాదని సూచించారు. ఈ వైరస్ చాలా ప్రమాదకరమని, అది ఎంత వేగంగా విస్తరిస్తోందో మనకు కనిపిస్తూనే ఉందని పేర్కొన్నారు. ప్రస్తుతం ఒమిక్రాన్ ఉపరకం బీఏ.2పై విశ్లేషణ చేస్తున్నామని చెప్పారు.


More Telugu News