నెల తర్వాత వాహనదారులకు పెట్రో ధరల వాత!

  • మూడు నెలలుగా దేశీయంగా పెరగని ధరలు
  • అంతర్జాతీయ మార్కెట్లో ధరలకు రెక్కలు
  • బ్యారెల్ ధర 69 డాలర్ల నుంచి 93 డాలర్లకు
  • ఎన్నికల తర్వాత పెంచే అవకాశం
కొంత కాలంగా పెట్రో ధరలు అక్కడే స్థిరపడ్డాయి. కేంద్ర సర్కారు 2021 నవంబర్ 3న ఎక్సేంజ్ సుంకం తగ్గించడంతో ధరల పెరుగుదలకు బ్రేక్ పడింది. అయితే అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు ఇదే కాలంలో గణనీయంగా పెరిగాయి. అయినా దేశీయంగా చమురు మార్కెటింగ్ కంపెనీలు ధరలను అదే స్థాయిలో కొనసాగిస్తున్నాయి.

కీలకమైన ఐదు రాష్ట్రాల ఎన్నికలు ఈ నెలలో ఉండడం తెలిసిందే. దీంతో కేంద్ర సర్కారు నుంచి వచ్చిన సూచనల మేరకే ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ధరలను పెంచకుండా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నట్టు తెలుస్తోంది. ఫిబ్రవరి 10 నుంచి మార్చి 7 వరకు ఎన్నికలు ఉన్నాయి. ఇవి ముగిసిన తర్వాత పెట్రోలియం, డీజిల్ ధరలను పెంచే అవకాశం ఉంది.

తాజాగా అంతర్జాతీయ మార్కెట్లో బ్యారెల్ ముడి చమురు ధర 93 డాలర్లకు చేరింది. 2021 డిసెంబర్ 1న బ్యారెల్ ధర 69 డాలర్లుగా ఉంది. అదే ఏడాది నవంబర్ 4న ముడి చమురు బ్యారెల్ ధర 81 డాలర్లుగా ఉండగా అక్కడి నుంచి డిసెంబర్ ఆరంభానికి తగ్గింది. కానీ అక్కడి నుంచి చమురు ధరలు పెరుగుతూ వస్తున్నాయి. కానీ, ఇదే కాలంలో పెట్రోల్, డీజిల్ ధరల్లో మార్పు లేకపోవడం గమనార్హం.

రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధవాతావరణం నెలకొనడం కూడా చమురు ధరల ఆజ్యానికి కారణమవుతోంది. గతేడాది ననంబర్ 4 తర్వాత నుంచి 15 శాతం మేర ధరలు పెరగడంతో వచ్చే నెలలో దేశీయంగాను ధరలను పెంచొచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం ఆయిల్ కంపెనీల తీరును రాజకీయ అంశాలే ప్రభావితం చేస్తున్నట్టు ఇండియా రేటింగ్స్ అండ్ రీసెర్చ్ ప్రధాన ఆర్థికవేత్త సునీల్ కుమార్ సిన్హా పేర్కొన్నారు. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు ఇదే స్థాయిలో కొనసాగితే ఎన్నికల తర్వాత షాక్ కు సిద్ధం కాక తప్పదని వ్యాఖ్యానించారు.


More Telugu News