రవి బిష్ణోయ్ ను పొగడ్తలతో ముంచెత్తిన రోహిత్ శర్మ

  • మొదటి మ్యాచులోనే మంచి పనితీరు
  • అతడికి ఉజ్వలమైన భవిష్యత్తు ఉంది
  • ఏ పిచ్ అయినా బౌలింగ్ చేయగలడు
  • అతడ్ని భిన్నంగా చూస్తున్నాం
స్పిన్ బౌలర్ రవి బిష్ణోయ్ ప్రతిభకు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ముగ్ధుడయ్యాడు. అతడికి ఉజ్వలమైన భవిష్యత్తు ఉందని ప్రకటించాడు. బుధవారం వెస్టిండీస్ తో జరిగిన టీ20 మ్యాచ్ లో భారత్ విజయం సాధించడం తెలిసిందే. ఈ మ్యాచ్ లో రవి బిష్ణోయ్ తన బౌలింగ్ తో వెస్టిండీస్ ను కట్టడి చేశాడు. కీలకమైన రెండు వికెట్లను తీయడమే కాకుండా.. నాలుగు ఓవర్లలోనూ కట్టుదిట్టమైన బౌలింగ్ తో 17 పరుగులే ఇచ్చాడు.

దీనిపై రోహిత్ శర్మ మాట్లాడుతూ.. రవి బిష్ణోయ్ లో భిన్నమైన టాలెంట్ ను చూస్తున్నట్టు చెప్పారు. తొలి టీ20 మ్యాచులో లెగ్ బ్రేకుల కంటే గూగ్లీలను ఎక్కువగా వేసినట్టు చెప్పాడు. ఇప్పటి వరకు రవి బిష్ణోయ్ భారత జట్టు తరఫున ఇంటర్నేషనల్ మ్యాచ్ లలో ఆడలేదు. మొదటి సారి టీ20 మ్యాచ్ రూపంలో వచ్చిన అవకాశాన్ని అతడు చక్కగా ఉపయోగించుకున్నాడు. అతడి ప్రతిభను గుర్తించిన లక్నో సూపర్ జెయింట్స్ ఫ్రాంచైజీ మెగా వేలానికి ముందే ఎంపిక చేసుకోవడం గమనార్హం.

‘‘యువ లెగ్ స్పిన్నర్ బిష్ణోయ్ ఎంతో ప్రతిభ కలిగిన వాడు. అందుకే అతడ్ని నేరుగా జట్టులోకి తీసుకున్నాం. అతడ్ని భిన్నంగా చూస్తున్నాం. అతనిలో చాలా వైవిధ్యాలు, నైపుణ్యాలు ఉన్నాయి. ఏ పిచ్ అయినా బౌలింగ్ చేయగలడు. దీంతో బౌలర్లను మార్చుకునేందుకు మాకు ఎన్నో ఆప్షన్లు ఉంటాయి. భారత్ కు ఆడిన మొదటి మ్యాచులో అతడి పనితీరు పట్ల సంతోషంగా ఉన్నాము’’ అని రోహిత్ శర్మ చెప్పాడు.


More Telugu News