‘నేనే గొప్ప’ అనే అహం.. పరిశ్రమంతా ఒక కుటుంబమంటూనే రాజకీయాలు చేస్తున్నారు: మోహన్ బాబు సంచలన వ్యాఖ్యలు

  • వాళ్ల గోతులు వాళ్లే తీసుకుంటున్నారు
  • నన్ను సీఎంవో ఆహ్వానించినా వాళ్లే పిలవలేదు
  • వాళ్లు ఈగో సమస్యలతో బాధపడుతున్నారు
  • వాళ్లు పిలిచినా పిలవకపోయినా తనకంటూ ఓ విలువుందన్న మోహన్ బాబు
సినీ పరిశ్రమలో కొందరు రాజకీయాలు చేస్తున్నారని ప్రముఖ నటుడు మోహన్ బాబు మండిపడ్డారు. సినీ పరిశ్రమంతా ఒకే కుటుంబం అంటూనే పరస్పరం ఎదుటి వాళ్లను విమర్శిస్తూ రాజకీయాలు చేన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన నటించిన ‘సన్ ఆఫ్ ఇండియా’ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో.. సినీ పరిశ్రమలో ఇటీవలి పరిణామాలపై ఆయన స్పందించారు.

ఏపీ సీఎం జగన్ తో సమావేశానికి తనకూ ఆహ్వానం అందిందని, కానీ, కొందరు కావాలనే తాను రాకుండా అడ్డుకున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల సినిమా టికెట్ల విషయంపై చర్చించేందుకు సీఎం దగ్గరకు కొందరు సినీ ప్రముఖులు వెళ్లారని, తననూ పిలవాల్సిందిగా సీఎంవో వారికి సమాచారమిచ్చిందని చెప్పారు. కానీ, వాళ్లు తనను పిలవలేదన్నారు. వాళ్లు పిలిచినా పిలవకపోయినా తనకంటూ ఓ చరిత్ర, గౌరవం, విలువ ఉన్నాయని ఆయన స్పష్టం చేశారు. తన గురించి ఎవరో ఏదో అనుకుంటే అది వాళ్ల కర్మ అని అన్నారు.
 
బయటలాగానే సినీ ఇండస్ట్రీలో రాజకీయాలు చేస్తూ ఎవరి గోతులు వాళ్లే తీసుకుంటున్నారని ఆయన అన్నారు. ఏపీలో సినిమా టికెట్ ధరల విషయంపై చర్చించేందుకు అందరం కలిసి వెళ్దామని రెండు నెలల క్రితమే బహిరంగ లేఖ విడుదల చేశానని గుర్తు చేశారు. కానీ, దానిపై ఎవరూ మాట్లాడలేదని చెప్పారు.

'నటీనటులు, జూనియర్ ఆర్టిస్టులు బిజీగా ఉన్నారంటూ విషయాన్ని దాటవేశారు. ఎందుకంటే వాళ్లందరికీ ఈగో సమస్య వుంది' అన్నారాయన. ‘నేనే గొప్ప’ అనే అహంకారం వల్లే సినీ ఇండస్ట్రీలో అందరం కలువలేకపోతున్నామని చెప్పారు. తన దృష్టిలో ఎవరూ గొప్ప కాదన్నారు. అన్నీ ఆ భగవంతుడు చూస్తున్నాడన్నారు. గతంలో అన్ని చిత్ర పరిశ్రమలకు చెందిన స్టార్ హీరోలంతా కలిసి ఉండేవాళ్లని, ఇప్పుడు ఆ పరిస్థితి లేదని మోహన్ బాబు అన్నారు.


More Telugu News