కిడ్నాప్ కేసులో మాజీ మంత్రి భూమా అఖిలప్రియ సహా 37 మందిపై చార్జ్‌షీట్

  • గతేడాది జనవరి 5న ప్రవీణ్‌రావు, ఆయన సోదరుల కిడ్నాప్
  • అఖిలప్రియ, ఆమె భర్త, సోదరులను సూత్రధారులుగా గుర్తించిన పోలీసులు
  • అందరూ అరెస్ట్.. ఆపై విడుదల
  • త్వరలోనే కేసు విచారణకు వచ్చే అవకాశం
అంతర్జాతీయ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు ప్రవీణ్‌రావు, ఆయన సోదరులు సునీల్‌రావు, నవీన్‌రావుల కిడ్నాప్ కేసులో ఏపీ మాజీ మంత్రి భూమా అఖిలప్రియ సహా మొత్తం 37 మందిపై పోలీసులు చార్జ్‌షీట్ దాఖలు చేశారు. గతేడాది జనవరి 5న జరిగిన ఈ కిడ్నాప్ వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది. ఐటీ అధికారుల పేరుతో వారింట్లోకి చొరబడిన దుండగులు ముగ్గురినీ కిడ్నాప్ చేసి తీసుకెళ్లారు.

అప్రమత్తమైన పోలీసులు వారి కోసం గాలిస్తున్న సమయంలో కిడ్నాప్ చేసిన ముగ్గురినీ ఆ తర్వాతి రోజు దుండగులు వదిలిపెట్టేశారు. ఈ కేసులో అఖిలప్రియ, ఆమె భర్త భార్గవ్‌రామ్, సోదరుడు జగత్‌విఖ్యాతరెడ్డి, అనుచరుడు గుంటూరు శ్రీనుకు సంబంధాలు ఉన్నాయని గుర్తించిన పోలీసులు తొలుత అఖిలప్రియను అరెస్ట్ చేశారు.

ఆ తర్వాత మిగతా నిందితులనూ పట్టుకున్నారు. అనంతరం వీరంతా బెయిలుపై విడుదలయ్యారు. కాగా, పోలీసులు దాఖలు చేసిన చార్జ్‌షీట్‌ను న్యాయస్థానం పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. కాబట్టి త్వరలోనే కేసు విచారణకు వచ్చే అవకాశం ఉంది.


More Telugu News